డైలీ కేసులు 68 వేలు దాటినయ్

డైలీ కేసులు 68 వేలు దాటినయ్
  • అక్టోబర్ 11 నుంచీ ఒక్కరోజులో ఇదే హయ్యెస్ట్  
  • వరుసగా19వ రోజు భారీగా పెరిగిన బాధితులు 
  • 1.20 కోట్లు దాటిన మొత్తం కేసులు 
  • మరో 291 మంది మృతి.. 1,61,843కు చేరిన డెత్స్ 

న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజును మించి రోజు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 68,020 మందికి వైరస్ కన్ఫామ్ అయింది. వరుసగా19వ రోజు కేసులు భారీగా పెరిగాయని, అక్టోబర్11వ తేదీ నుంచీ ఇవే అత్యధిక డైలీ కేసులని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు చేరినట్లు తెలిపింది. ఇక యాక్టివ్ కేసులు ఆదివారం 35,498 పెరిగాయి. మొత్తం 5,21,808కి చేరాయి. మరోవైపు రికవరీ రేట్ 94.32 శాతానికి పడిపోయింది. ఆదివారం మరో 291 డెత్స్ నమోదయ్యాయి. మొత్తం మరణాలు 1,61,843కు చేరాయి. 
8 రాష్ట్రాల్లోనే 84.5% కేసులు
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసుల్లో 84.5 శాతం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 31,643, కర్నాటకలో 2,792, పంజాబ్​లో 2,914 కొత్త కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లోనూ 2 వేలకు పైగా చొప్పున కేసులు వచ్చాయి. ఇక ఆదివారం నాటికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి 72 రోజులు కాగా, ఈ ఒక్కరోజు 2,60,653 డోసుల వ్యాక్సిన్​లు ఇచ్చారు. మొత్తం 6,05,30,435 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 
మహారాష్ట్ర- బడ్వానీ బార్డర్ క్లోజ్ 
మధ్యప్రదేశ్ లోని బడ్వానీ జిల్లా అధికారులు మహారాష్ట్రతో బార్డర్​ను క్లోజ్ చేశారు. మహారాష్ట్రతో బడ్వానీ జిల్లాకు 200 కిలోమీటర్ల మేరకు బార్డర్ ఉంది. రోజూ వేలాది మంది ప్రజలు బార్డర్ కు అటూఇటూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో బడ్వానీ జిల్లాలోనూ ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో బార్డర్ ను క్లోజ్ చేసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. బార్డర్ లోని ఆగ్రా–ముంబై రోడ్, ఖేతియా రోడ్ తో సహా అన్ని రోడ్లనూ మూసేసినట్లు తెలిపారు. 
ఇండోర్ లో 9.. పాల్ఘర్ లో 47 మంది అరెస్ట్   
కరోనా రూల్స్ ఉల్లంఘించి ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించినందుకు మధ్యప్రదేశ్ ఇండోర్ లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేట్ లో ఇండోర్ తో సహా 12 సిటీల్లో గతవారం నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ కు విరుద్ధంగా మందు పార్టీ నిర్వహించిన వ్యక్తులను అరెస్ట్ చేశామని, ఫాంహౌస్ ను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. అలాగే మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఆలెవాడిలోని ఓ రిసార్ట్ లో నైట్ కర్ఫ్యూ రూల్స్ కు విరుద్ధంగా పార్టీలో పాల్గొన్న 47 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేట్ అంతటా ఆదివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఐదు మంది కంటే ఎక్కువగా గుమిగూడరాదంటూ ఆదేశాలు జారీ చేశారు.

హోలీపై కరోనా ఎఫెక్ట్ 
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్ కనిపించింది. ఢిల్లీ, భువనేశ్వర్, తదితర సిటీల్లో హోలీ వేడుకలను నిషేధించారు. దీంతో ప్రజలంతా ఇండ్లలోనే వేడుకలు చేసుకున్నారు. ఆయా సిటీల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. అయితే, ముంబై సిటీ శివారులోని మహీమ్ కోలివాడ జనాలు మాత్రం కరోనాను ఖాతరు చేయకుండా హోలీ వేడుకలు చేసుకున్నారు. సోమవారం ఏకంగా 150 మంది రంగులు చల్లుకుంటూ, లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ లు చేశారు. చాలా మంది మాస్కులు కూడా పెట్టుకోలేదు. కొంతమంది పీపీఈ కిట్లు వేసుకుని వచ్చారు. అతికష్టం మీద అందరినీ ఇళ్లకు పంపించామని, కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.