
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం’
- ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యం
- 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో మనమెక్కడ?
- 5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వస్తే.. మనకు వచ్చినవి ఎన్ని?
- 56 అంగుళాల ఛాతీతో ఏం ప్రయోజనం?
- ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ, తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి
- చెన్నైలో ‘తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్‌లో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం.. మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘సామాజిక న్యాయం విషయంలో తెలంగాణ-, తమిళనాడు మధ్య సారూప్యతలు ఉన్నాయి. కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకుని మా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది” అని చెప్పారు. తమిళనాడు అమలు చేస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం’ తన హృదయాన్ని తాకిందని, ఇది పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నదని తెలిపారు. ఈ స్కీమ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. గురువారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తమిళనాడులో కామరాజ్ ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇందిరా గాంధీ అనుసరించారని, దేశంలో మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడేనని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
ఒలింపిక్స్‌లో మన స్థానమెక్కడ?
ఒలింపిక్స్‌లో మన దేశం స్థానమెక్కడుందో ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 30 ఎకరాలు ఉన్న దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్లకే 16 గోల్డ్ మెడల్స్ దక్కాయి. వాళ్లలో ఒక క్రీడాకారిణికే మూడు ఆర్చరీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మరి మన విజయ గాథ ఎక్కడ ఉంది? 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనం ఎక్కడ ఉన్నం? 56 అంగుళాల ఛాతితో ఏం ప్రయోజనం? మనం 140 కోట్ల మందిమి ఉన్నా ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోతున్నాం. మోదీ, అమిత్ షాతో ఇది సాధ్యం కాదు’’ అని తెలిపారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యతను తెలంగాణ, తమిళనాడు కలిసి తీసుకుంటున్నాయని చెప్పారు. ‘‘దేశానికి తమిళనాడు, తెలంగాణ రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నాయి. విజ్ఞాన కేంద్రాలుగా మారనున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ఏటా 1.10 లక్షల ఇంజనీర్లు.. స్కిల్ లేక ఉద్యోగలు వస్తలే
నాన్ ముదల్వన్ (స్కిల్ డెవలప్‌మెంట్), ప్రభుత్వ కాలేజీలకు వెళ్లే పిల్లలకు రూ.10 వేల ఉపకార వేతనం వంటి స్కీమ్‌లు తమిళనాడులో ఉండడం అదృష్టమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎంగా స్టాలిన్ ఉన్నారని కొనియాడారు. ‘‘తెలంగాణ నుంచి ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నా, నైపుణ్య లేమితో ఉద్యోగాలు దక్కడం లేదు. అందుకే వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం” అని ఆయన తెలిపారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యం
తమ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, అందుకే విద్యా శాఖను తానే నిర్వహిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యలో నైపుణ్యాల ను పెంచేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించామని, దాని చైర్మన్‌గా ఆనంద్ మహేంద్రను నియమించామని పేర్కొన్నారు. అలాగే, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని కూడా ప్రారంభించామని, ఇందులో సచిన్ టెండూల్కర్, అభి నవ్ బింద్రా వంటి దిగ్గజాలను డైరెక్టర్లుగా నియమించినట్లు వివరించారు. ‘‘గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు స్కూళ్లు ఉండేవి. మేం వారంతా వేర్వేరని అనుకోవడం లేదు. అందుకే ప్రతి సెగ్రెంట్లో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నాం. ఇందులో ఈ 4 వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకుంటారు. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. పాత సిలబస్‌తో పనికిరాని కోర్సులు బోధించే ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి, ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.