నేషనల్ అవార్డ్స్‌‌‌లో తెలుగు వెలుగులు

నేషనల్ అవార్డ్స్‌‌‌లో తెలుగు వెలుగులు

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీ వేదికగా ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలంతా అవార్డులు అందుకున్నారు. ‘పుష్ప.. ది రైజ్‌‌‌‌’ సినిమాలోని నటనకు బెస్ట్ యాక్టర్‌‌‌‌‌‌‌‌గా అల్లు అర్జున్‌‌‌‌ జాతీయ అవార్డును అందుకున్నారు. నేషనల్ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. 

ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ అవార్డులు రావడంతో నేషనల్ అవార్డ్స్ వేడుక తెలుగు సినీ ప్రముఖులతో కళకళలాడింది. ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’కి గాను రాజమౌళి అవార్డును అందుకోగా ఈ సినిమా నుంచి ఉత్తమ నేపథ్య సంగీతానికి కీరవాణి, ఉత్తమ గాయకుడుగా కాలభైరవ (కొమరం భీముడో), ఉత్తమ డాన్స్ కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌‌‌‌కు వి. శ్రీనివాస్ మోహన్, ఉత్తమ స్టంట్ మాస్టర్ కింగ్ సోలొమాన్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ లిరిక్ రైటర్‌‌‌‌‌‌‌‌గా చంద్రబోస్ (కొండపొలం చిత్రం), ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌‌‌‌గా ‘ఉప్పెన’ చిత్రానికి దర్శకుడు బుచ్చి బాబు, నిర్మాత నవీన్ యెర్నేని, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌‌‌‌గా ‘పురుషోత్తమచార్యులు’ టాలీవుడ్‌‌‌‌ నుంచి అవార్డులు అందుకున్నారు.

 ఇక హిందీ ‘ది కాశ్మీర్ ఫైల్స్‌‌‌‌’ సినిమాకుగాను నేషనల్ ఇంటిగ్రిషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డును తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్వీకరించగా, అదే చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి అవార్డును అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రి.. ది నంబి ఎఫెక్ట్‌‌‌‌’ చిత్రానికి గానూ మాధవన్, ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడుగా పంకజ్ త్రిపాఠి అవార్డును అందుకున్నారు. అలాగే వహీదా రెహ్మాన్‌‌‌‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఘనంగా సత్కరించారు. 

కష్టానికి దక్కిన ఫలితం

‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడంపై రాజమౌళి స్పందిస్తూ ‘ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకులను  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ చేయడమే నా మొదటి లక్ష్యం. అవార్డ్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ‘ఆర్ఆర్ఆర్’‌‌‌‌కు నేషనల్ లెవెల్‌‌‌‌లో ఆరు అవార్డులు రావడం ఆనందంగా ఉంది. మూడు నాలుగేళ్లుగా యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ పడిన కష్టానికి గుర్తింపు రావడం సంతోషం’ అన్నారు. 

‘మిమి’ చిత్రంలో నటనకు కృతిసనన్ ఉత్తమ నటిగా అవార్డును అందుకోగా.. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డును అందుకున్నారు. ఆమెతో పాటు హాజరైన రణబీర్ కపూర్.. అలియా అవార్డును అందుకునే సమయంలో ఓ భర్తగా ప్రౌడ్‌‌‌‌ మూమెంట్‌‌‌‌తో ఫొటోలు తీస్తుండడం అందరినీ ఆకట్టుకుంది. ఇక పెళ్లినాటి చీరతో అలియా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచిన కృతి సనన్, అలియాభట్ ఒకే కలర్ కాస్ట్యూమ్స్​లో  కనిపించి కనువిందు చేశారు.   

డబుల్ అచీవ్‌‌‌‌మెంట్ 

బన్నీతో పాటు భార్య స్నేహా రెడ్డి, తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘జాతీయ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదికూడా కమర్షియల్ సినిమా అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు నేషనల్ అవార్డు రావడం డబుల్ అచీవ్‌మెంట్’ అని చెప్పాడు. అలాగే ‘పుష్ప’ చిత్రంలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.