పటాన్చెరులో అట్టహాసంగా ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం

పటాన్చెరులో అట్టహాసంగా ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం
  • పాల్గొన్న కలెక్టర్​, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

పటాన్​చెరు, వెలుగు: పటాన్​చెరులో గురువారం 69వ ఎస్జీఎఫ్​క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మైత్రి క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. క్రీడా పతాకావిష్కరణ, క్రీడాజ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.

 క్రమశిక్షణతో పాల్గొని రాష్ట్రానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో అధిక జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్​లో  పతకాల పట్టికలో వెనుకబడి ఉన్నామన్నారు. ఆ పరిస్థితిని మార్చడానికి గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు.

  విద్యార్థులు దీన్ని మంచి అవకాశంగా మలుచుకొని కష్టపడాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్​చెరు రాష్ట్రస్థాయి క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో పాల్గొనేవారు జాతీయస్థాయిలో రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, యువజన సంక్షేమ-క్రీడాశాఖ అధికారి ఖాసీం బేగ్, ఆర్డీవో రాజేందర్, కోచ్‌లు, టీచర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.