తాగే నీళ్లలో డ్రైనేజీ వాటర్ కలవడంతో 8 మంది మృతి.. ఆస్పత్రుల్లో మరో 146 మందికి చికిత్స

తాగే నీళ్లలో డ్రైనేజీ వాటర్ కలవడంతో 8 మంది మృతి.. ఆస్పత్రుల్లో మరో 146 మందికి చికిత్స
  • మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌‌‌లో దారుణం
  • విచారణకు ఐఏఎస్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ

ఇండోర్: మధ్యప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరొందిన ఇండోర్‌‌‌‌లో తాగునీరు కలుషితమై 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 149 మంది ఆస్పత్రుల్లో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారు. తాగు నీళ్లలో డ్రైనేజీ వాటర్ కలిసినట్టు అధికారులు నిర్ధారించారు. సిటీలోని భాగీరథ్‌‌పురా ఏరియాలో నర్మదా నీళ్ల మెయిన్ పైప్‌‌లైన్‌‌ ఓ చోట లీకైంది. అదే ప్రాంతంలో పైప్‌‌లైన్‌‌పై టాయిలెట్ ఉంది. ఈ కారణంగానే తాగునీళ్లు కలుషితమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం 2,703 ఇండ్లలోని 12 వేల మందిని ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

మృతుల సంఖ్యపై తలోమాట.. 

తాగునీళ్లు దుర్వాసన వస్తున్నాయని ఈ నెల 25న స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోలేదు. ఆ నీళ్లు తాగినోళ్లకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారం రోజుల్లో 8 మంది చనిపోయారని, వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ముగ్గురే చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు ఆఫీసర్ల లెక్కలు తప్పు అని, ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ బుధవారం ప్రకటించారు. ‘‘భాగీరథ్‌‌పురాలో కలుషిత నీళ్లు తాగి ముగ్గురు చనిపోయారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ పేర్కొంది. 

కానీ ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు చనిపోయారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు” అని ఆయన వెల్లడించారు. ఇంకోవైపు కలుషిత నీళ్లు తాగి ఇప్పటివరకు నలుగురు చనిపోయారని ఇండోర్ కలెక్టర్ శివం వర్మ ప్రకటించారు. మరో 149 మంది బాధితులు సిటీలోని 27 ఆస్పత్రుల్లో ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని తెలిపారు. వాళ్ల హెల్త్ కండిషన్‌‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత మృతుల సంఖ్యను ప్రకటిస్తామని మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. 

ఇద్దరు ఆఫీసర్లపై వేటు.. 

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితుల ట్రీట్‌‌మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. సీఎం ఆదేశాలతో జోనల్ ఆఫీసర్, భాగీరథ్‌‌పురా ఏరియా అసిస్టెంట్ ఇంజనీర్‌‌‌‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ వేశారు. 

కాగా, బీజేపీ సర్కార్‌‌‌‌పై కాంగ్రెస్ ఫైర్ అయింది. ‘‘అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యను దాయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇండోర్ ఇలాంటి ఘటన జరగడం దారుణం” అని స్టేట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలాభ్ శుక్లా మండిపడ్డారు.