జస్ట్ మిస్ లేకపోతే : సిగ్నల్ జంక్షన్ రోడ్డులో 7 అడుగుల గొయ్యి..

జస్ట్ మిస్ లేకపోతే : సిగ్నల్ జంక్షన్ రోడ్డులో 7 అడుగుల గొయ్యి..

బెంగుళూరు అనగానే సాధారణంగా చాలా మందికి గుర్తొచ్చేది హడావిడిగా కనిపించే రోడ్లు, ట్రాఫిక్ జామ్, భారీ అద్దెలు. గమ్యస్థానాలకు చేరుకోవడంలో పెరుగుతున్న ఆలస్యాన్ని నొక్కి చెప్పిన వీడియోలు, పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చని ఆశిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం రోడ్డుపై కనిపించిన విజువల్స్ ప్రయాణికులను ఆశ్చర్యానికి, భయానికి గురి చేశాయి. డిసెంబర్ 11న సాయంత్రం నగరంలోని హలాసూరు ప్రాంతంలోని కెన్సింగ్టన్ సిగ్నల్ జంక్షన్ వద్ద రోడ్డుపై ఏడు అడుగుల లోతైన గుంత కనిపించింది.

భూగర్భ పైప్‌లైన్‌ల నుంచి నీటి లీకేజీ ఈ భారీ గుంతకు కారణమని ప్రాథమిక అంచనాలు సూచించాయి. సోమవారం రాత్రి 8 గంటలకు సింక్‌హోల్ కనిపించిందని, భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని కట్టడి చేయాల్సి వచ్చిందని ఓ నివేదిక తెలిపింది. 2022లో వేసిన రోడ్డులో సింక్‌హోల్ కనిపించిందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై సింక్‌హోల్ ఏర్పడడానికి కారణమేమిటనే దానిపై సమగ్ర దర్యాప్తు చేయడానికి నిపుణులు ఇంకా ఆ స్థలానికి చేరుకోలేదు.

నగరంలో రోడ్డుపై సింక్‌హోల్‌ కనిపించడం ఇటీవలి కాలంలో ఇదేం తొలిసారి కాదు. మే నెలలో నగరంలో కురిసిన భారీ వర్షాలకు బీటీఎం లేఅవుట్‌లో నాలుగు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నారని చుట్టుపక్కల ప్రజలు ఆరోపించారు.