ఇన్ సైడర్ ట్రేడింగ్.. అమెరికాలో మనోళ్లు ఏడుగురిపై కేసు

ఇన్ సైడర్ ట్రేడింగ్.. అమెరికాలో మనోళ్లు ఏడుగురిపై కేసు

న్యూయార్క్: ఇన్ సైడర్ ట్రేడింగ్​తో అక్రమంగా రూ.7.56 కోట్లు సంపాదించిన ఏడుగురు మనోళ్లపై అమెరికాలో కేసు నమోదైంది. వీళ్లలో ముగ్గురు తమ కంపెనీ సమాచారాన్ని చోరీ చేసి, లాభాలు వచ్చాయని గుర్తించి.. ఆ కంపెనీ లాభనష్టాల వివరాలను అధికారికంగా వెల్లడించడానికంటే ముందే మిగతా వాళ్లతో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేయించారని ఫెడరల్ అధికారులకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) ఫిర్యాదు చేసింది. నిందితులు ఏడుగురూ కాలిఫోర్నియాలో ఉంటున్నారని అందులో పేర్కొంది. హరిప్రసాద్ సూరి(34), లోకేశ్ లడుగు(31), చోటు ప్రభు తేజ్ పులగం(29) ఫ్రెండ్స్. వీళ్లు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ట్విలియోలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురూ 2020 మార్చిలో కంపెనీ డేటాబేస్​ను యాక్సెస్ చేసి, కంపెనీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని తెలుసుకున్నారు. మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తే కంపెనీ షేర్ల ధర బాగా పెరుగుతుందని గుర్తించారు. ఈ సమాచారాన్ని తమ బంధువులకు తెలియజేశారు. దీంతో వాళ్లు కంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించడానికంటే ముందే ట్విలియో ఆప్షన్లు, స్టాక్​లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత మే 6న కంపెనీ ఫలితాలు వెల్లడించడం, కంపెనీ షేర్లు భారీగా పెరగడంతో దాదాపు రూ.7.56 కోట్లు లాభం పొందారు. అనుమానం వచ్చి ఎస్ఈసీ ఆరా తీయగా మోసం బయటపడింది.