దేశంలో 12కు పెరిగిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

దేశంలో 12కు పెరిగిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకూ ఐదు కేసులకు పరిమితమైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. సాయంత్రం ఒక్కసారిగా పెరిగాయి. మనకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో తాజాగా ఏడు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే కేసుతో ఉన్న మహారాష్ట్రలో కొత్తగా మరో ఏడు పెరగడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎనిమిదికి చేరినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం 12 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

దేశంలో ఢిల్లీ, గుజరాత్ లో ఒక్కో కేసు నమోదు కాగా.. కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి విస్తృత పరీక్షలు నిర్వహించి.. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఒమిక్రాన్ కేసులు అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక తెలంగాణలోనూ కొత్తగా విదేశాల నుంచి వచ్చిన 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరి శాంపిల్స్‌ను ఇప్పటికే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. వాటి రిజల్ట్ రావాల్సి ఉంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు.