బలూచిస్తాన్‎లో భారీ IED పేలుడు.. ఏడుగురు పాక్ జవాన్లు మృతి

బలూచిస్తాన్‎లో భారీ IED పేలుడు.. ఏడుగురు పాక్ జవాన్లు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‎లోని భారీ పేలుడు సంభవించింది. దక్షిణ బలూచిస్తాన్ ప్రావిన్స్‎లో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు భారీ ఐఈడీ బాంబ్‎ను పేల్చారు. ఈ ఘటనలో ఏడుగురు పాక్ జవాన్లు మృతి చెందగా.. మరికొందరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఈ దాడికి ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు మొదలుపెట్టారు. 

2025, ఏప్రిల్ 15న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పోలీసు ట్రక్కును లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఈ ఘటన మురవకముందే మరోసారి ఆర్మీ వాహనమే లక్ష్యంగా అలాంటి తరహా దాడే జరిగింది. ఈ ఘటనపై పాక్ ఆర్మీ విచారణ మొదలుపెట్టింది. 

కాగా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) గత కొంతకాలంగా పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం పోరాడుతోన్న విషయం తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఇటువంటి దాడులను చేసింది. 2025, మార్చిలో బలూచిస్తాన్‌లో ఏకంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ వేర్పాటువాదులు హైజాక్ చేయడం సంచలనం రేపింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా దళాలను టార్గెట్ చేసుకుని దాడి చేయడం బీఎల్ఏకు అలవాటే కావడంతో.. తాజాగా జరిగిన దాడి వెనక కూడా వీరి హస్తమే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.