ఏడుకు చేరిన కల్తీ కల్లు మృతులు.. మూడు కల్లు దుకాణాల లైసెన్స్ రద్దు

ఏడుకు చేరిన కల్తీ కల్లు మృతులు.. మూడు కల్లు దుకాణాల లైసెన్స్ రద్దు
  • అల్ఫ్రాజోలం కలిసి కల్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ
  • ఇద్దరు ఓనర్లు, విక్రేతలు అరెస్ట్

కూకట్​పల్లి/బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ కూకట్​పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కూకట్​పల్లి శంషీగూడ పరిధిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన నర్సమ్మ (54) ఈఎస్ఐ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. శంషీగూడ పరిధిలోని శ్రీరామ్​నగర్​కు చెందిన నారాయణ.. నిమ్స్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటూ బుధవారం రాత్రి మృతి చెందాడు. కూకట్​పల్లిలోని పలు ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మొత్తం 44 మంది స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నిమ్స్, గాంధీ హాస్పిటళ్లకు తరలించారు. వీరిలో ఏడుగురు చనిపోగా.. మిగిలిన వాళ్లంతా చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల నుంచి నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న సూరమ్మ (40) అనే మహిళను మెరుగైన చికిత్స కోసం గురువారం మధ్యాహ్నం నిమ్స్​కి తరలించారు.

3 కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు
కల్తీ కల్లు విక్రయించి ఏడుగురు మృతికి, పలువురి అస్వస్థతకు కారణమైన3 కల్లు దుకాణాల లైసెన్స్​లను ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం రద్దు చేశారు. హైదర్​నగర్, హెచ్ఎంటీహిల్స్, సర్దార్​పటేల్​నగర్ దుకాణాల్లోని కల్లులో ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ అయింది. కల్లు వ్యాపారులు రవితేజ గౌడ్​(29), కోన సాయితేజ గౌడ్​(31), విక్రేతలు చెట్టుకింది నగేశ్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్​గౌడ్​ (39)ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. 

సమగ్ర నివేదిక ఇవ్వాలన్న రాష్ట్ర  మానవ హక్కుల కమిషన్
కూకట్ పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరఫున హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మనేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు కాంపౌండ్ లను తనిఖీలు నిర్వహించి.. మళ్లీ ఇలాంటి సంఘటనలు రిపీట్​ కాకుండా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుపై స్పందించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చే నెల 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ..
కూకట్‌‌పల్లిలో కల్తీ కల్లు గుట్టు రట్టు చేయడంలో ఎక్సైజ్ శాఖ ఐదు బృందాలుగా విడిపోయి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. హైదర్‌‌నగర్, హెచ్‌‌ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్‌‌నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించింది. వీటిని నారాయణగూడలోని ల్యాబ్‌‌కు పంపగా.. భాగ్యనగర్ మినహా మిగిలిన మూడు దుకాణాల్లో కల్తీ కల్లు తయారీ చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆబ్కారీ అధికారులు మూడు కల్లు దుకాణాల లైసెన్సులను రద్దు చేశారు.