నాన్ స్టాప్ వర్షం.. ఆరంఘర్ఫ్లై ఓవర్ దగ్గర నీట మునిగిన బస్సు.. తాళ్ల సాయంతో లాగాల్సి వచ్చింది !

నాన్ స్టాప్ వర్షం.. ఆరంఘర్ఫ్లై ఓవర్ దగ్గర నీట మునిగిన బస్సు.. తాళ్ల సాయంతో లాగాల్సి వచ్చింది !

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. శుక్రవారం (జులై 18) రాజేంద్రనగర్ లో గంటపాటు నాన్ స్టాప్ గా కురిసిన వానకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆరాంఘర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా నీరు నిలవటంతో చెరువుల మాదిరిగా తలపించాయి. 

ఆరాంఘర్   ఫ్లైఓవర్ వద్ద బస్సు నీటిలో మునిగి పోయింది. బస్సు ఇంజన్ లోకి నీళ్లు చేరడంతో బస్సు ఆగిపోయింది. ఎంత సేపటికీ ఇంజిన్ ఆన్ కాకపోవడంతో.. ప్రయాణికులను కిందికి దించారు అధికారులు. బస్సు ఆగిపోవటంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. నీళ్లలో మునిగిపోయిన బస్సును తాడు సాయంతో బయటకు లాగారు రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా టీం. 

హైదరాబాద్ లో దాదాపు మూడు గంటలు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బోయిన్ పల్లిలో అత్యధికగా 9.3 సెం.మీ. వర్షం నమోదైంది. బండ్లగూడలో 9.18 సెంమీ వర్షం కురిసింది. 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

మారేడ్ పల్లిలో 7.6 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 7.35 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, బండ్లగూడ, బాలానగర్, అంబర్ పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.