మంచిర్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య

మంచిర్యాల జిల్లాలో బాలిక దారుణ హత్య
  • బావిలో మృతదేహం లభ్యం
  • 3 రోజుల కిందట చిన్నారి కిడ్నాప్
  • పోలీసుల అదుపులో అనుమానితులు

దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మూడు రోజుల కిందట కిడ్నాప్  అయిన బాలిక దారుణ హత్యకు గురైంది. ఆమె డెడ్​బాడీ వ్యవసాయ బావిలో కనిపించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగరపు మహన్విత (7) సోమవారం సాయంత్రం తోటి పిల్లలతో తమ ఇంటి ముందు ఆడుకుంటోంది. మిగతా పిల్లలు తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోగా మహన్విత ఇంటికి వెళ్లలేదు. 

దీంతో బాలిక తండ్రి శేఖర్  తమ కూతురు కనిపించడంలేదని, గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్  చేశారని మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్​లో కంప్లైంట్​ ఇచ్చారు. మిస్సింగ్  కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం నంబాలలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ తహసీనోద్దిన్.. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయించారు. 

మృతదేహం మహన్వితదిగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బావిలో పడేసినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో సెర్చ్ చేయగా.. మృతురాలి ఇంటి పరిసరాల్లో తిరిగి ఆమె ఇంటి దగ్గరకొచ్చి ఆగిపోయింది. మహన్విత ఇంటి చుట్టుపక్కల ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.