
న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, అయినా ఇప్పటికీ కోట్లాది మంది కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలోనే ఉన్నారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత్లో ఇంకా 7 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం(ఎక్స్ ట్రీమ్ పావర్టీ)లో మగ్గుతున్నారని, దేశ జనాభాలో 35 కోట్ల మంది అంటే.. ప్రతి నలుగురిలో ఒకరు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. 2011 నుంచి 26 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, కానీ వేర్వేరు కోణాల్లో జీవన ప్రమాణాలను బట్టి ప్రత్యేకంగా చూస్తే ఈ లెక్కలు మారతాయని వివరించింది.
ఇక దేశ సంపదలో 40% వరకూ కేవలం 1% మంది సంపన్నుల చేతిలోనే ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం చాలామంది అత్యంత పేదల కేటగిరీ నుంచి బయటపడినప్పటికీ పౌష్టికాహారం, సురక్షితమైన ఇల్లు, విద్య, వైద్యం వంటి అంశాల్లో వెనకబడి ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇండియాలో 2011 నుంచి ప్రజా సంక్షేమం, జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడ్డాయి. అంతర్జాతీయ అంచనాల ప్రకారం.. గతంలో రోజుకు 3 డాలర్లు (రూ.256) ఖర్చు చేయగలిగే వ్యక్తులు పేదరికం నుంచి బయటపడినట్లు భావిస్తారు.
ఈ ప్రకారం చూస్తే ప్రస్తుతం భారత్లో 5% మంది మాత్రమే అత్యంత పేదలుగా ఉన్నారు. అంటే వీరు రోజుకు 3 డాలర్లు కూడా సంపాదించే స్థితిలో లేరు. దీని ప్రకారం చూస్తే.. 2011 నుంచి దశాబ్ద కాలంలో దాదాపు 26.9 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే, ఇండియా విషయంలో పీపీపీ విధానం సరికాదు. లోయర్ మిడిల్ ఇన్ కమ్ (ఎల్ఎంఐ) ప్రకారం, రోజుకు కనీసం 4 డాలర్లు (రూ. 358) సంపాదించగలిగే వ్యక్తులు పేదరికం నుంచి బయట పడ్డట్టు భావించాలి” అని ప్రపంచ బ్యాంకు వివరించింది.