అదేదో ఆకాశం నుంచి ఉల్కలు, గ్రహశకాలు పడి ఏర్పడిన భారీ గుంతల మాదిరగా పెద్ద పెద్ద గుంతలు. ఒకటి కాదు రెండు కాదు.. దేశ వ్యాప్తంగా ఏకంగా 700 లకు పైగా మహాబిలాలు.. ఉన్నట్లుండి సడెన్ గా గ్రామాలు, పంటపొలాలు, రోడ్లు ఇలా వేటిని వదలకుండా ఏర్పడుతున్న గుంతలతో టర్కీ దేశం భవిష్యత్ పై తీవ్రమైన భయాందోళనలో మునిగిపోయింది. దేశ మనుగడకే ప్రశ్నార్థకం అయిన రాకాసి గుంతల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ధాన్యాగారంగా పేరున్న టర్కీ కొన్యా ప్రాంతంలో వందల కొద్ది గుంతలు (సింక్ హోల్స్) ఏర్పడటంతో.. ఆ దేశ వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అత్యధికంగా పండే గధమ పంటపొలాలను లాగేసుకుంటూ ఏర్పడుతున్న భారీ గుంతలు ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి దారితీశాయి.
డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తే కొన్యా సమీప జిల్లాల్లోనే 684 గుంతలు.. గుండెకు చిల్లులు పడిన మాదిరిగా.. టర్కీ భూములను మింగేస్తున్నాయి. దీనికి కారణం దారుణమైన కరువు, టర్కీ పంటపొలాల కింద ఉన్న భూముల స్వభావం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ శాతం గుంతలు కొన్యా బేసిన్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.
కారణం ఇదే:
టర్కీలో చాలా వరకు భూమి పొరలు కార్బోనేట్, జిప్సం కలయికతో ఏర్పడ్డాయి. అంటే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సున్నపురాళ్లతో కూడిన నేలలు ఎక్కువ. ఇవి మెల్లగా కురుగుతూ ఉంటాయి. దీనికి తోడు భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో.. ఈ భూములకు కింది నుంచి సపోర్ట్ తగ్గిపోవడంతో.. పొరల పటుత్వం తగ్గిపోయి.. పగుళ్లు వచ్చి.. మీటర్ల లోతుల్లోకి పడిపోతున్నాయి. దీంతో సింక్ హోల్స్ ఏర్పడుతున్నాయి.
కొన్యా భూభాగంలో 2000వ సంవత్సరానికి ముందు వేలితో లెక్కపెట్టే అన్ని గుంతలు మాత్రమే ఉండేవంట. కానీ గత ఇరవై ఏళ్లుగా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైన కరువుతో బోరు బావుల ద్వారా భూగర్భ జలాలను విపరీతంగా తోడుతుండటంతో.. భూమిలోపల నీరు లేక.. సున్నపు రాతి పైభాగం పట్టు కోల్పోయి పెద్ద పెద్ద బిలాలుగా పడుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2021 నుంచి గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని .. ముందు ముందు ఇంకా ఎన్ని సింక్ హోల్స్ ఏర్పడుతాయోనని భయాందోళనలో ప్రజలున్నారు. 1970 తర్వాత ఒక్కో ఏరియాల్లో దాదాపు 60 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయినట్లు అధికారులు తెలిపారు.
డేంజర్ జోన్లో పట్టణాలు, పంటపొలాలు:
పెరుగుతున్న సింక్ హోల్స్ కారణంగా టర్కీలోని పట్టణాలు డేంజర్ జోన్ లో పడిపోయాయి. ఎప్పుడు గుంతలు పడతాయోననే భయాందోళనలో ప్రజలు గడుపుతున్నారు. టర్కీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (AFAD) లెక్కల ప్రకారం కేవలం కొన్యా బేసిన్ లోనే 684 సింక్ హోల్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరప్నార్ జిల్లా నుంచి కరమాన్, అక్సరాయ్ జిల్లాల వరకు ఈ సింక్ హోల్స్ ఏర్పడ్డాయి. కనీసం 30 మీటర్ల లోతుల్లో ఉండే గుంతలు.. పంటపొలాలను మింగేస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ వినియోగంపై కచ్చితమైన నిబంధనలు అమలు చేయకుంటే.. బ్రెడ్ బాస్కెట్ గా పేరున్న టర్కీ.. పూర్తిగా విధ్వంసం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

