హస్తాల్​పూర్​లో లావా బూడిద గుట్టలు

హస్తాల్​పూర్​లో లావా బూడిద గుట్టలు
  • గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

హైదరాబాద్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని హస్తాల్ పూర్ గ్రామంలో అగ్నిపర్వత లావాకు సంబంధించిన బూడిద గుట్టలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు బీవీ భద్రగిరీశ్ గుర్తించారు. గ్రామ శివారులో సుద్ద గుట్టలని పిలిచే బూడిద గుట్టలున్నాయని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో  భద్రగిరీశ్ ఆ ప్రాంతా న్ని పరిశీలించారు. అర కిలోమీటరు పరిధిలో రెండు అడుగుల లోతులో బూడిద విస్తరించి ఉన్నట్లు ఆయన గుర్తించారు. బూడిద నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. అందులో  కర్బనం లేకపోవడం, కేజీకి దాదాపు 5 మిల్లీ గ్రాముల దాకా గంధకం ఉండటాన్ని భద్రగిరీశ్ గమనించారు.

పరిశోధన వివరాలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు పరిశీలించి.. ఈ బూడిద 75 వేల ఏళ్ల క్రితం ఇండోనేషియాలో బద్దలైన టోబా అగ్నిపర్వత లావాదని నిర్ధారించారు. సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించిందని తెలిపారు.  అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా పేరుకుపోయిందని వెల్లడించారు.  అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వ తం బూడిద కుప్పలు మేటవేసినట్లు చెప్పారు. ఏపీలోని జ్వాలాపురంలో మెరుగు సుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు వీటిలో భాగమేనన్నారు.