వారంలోనే 766 టీఎంసీలు బంగాళాఖాతంలోకి

వారంలోనే 766 టీఎంసీలు బంగాళాఖాతంలోకి
  • కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న ప్రవాహం
  • గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరద తగ్గుముఖం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గోదావరి వరద పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తోంది. వారంలో 766 టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలిశాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు ధవళేశ్వరం నుంచి బంగాళాఖాతంలోకి 800.79 టీఎంసీల నీళ్లు చేరాయి. ఈనెల 9 వరకు గోదావరిలో పెద్దగా వరదలు లేవు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 39 రోజుల్లో 8.16 టీఎంసీలు మాత్రమే సముద్రంలోకి వెళ్లాయి. పదో తేదీ నుంచి సముద్రానికి మోస్తరు ప్రవాహం మొదలైంది. అది క్రమేణా పెరుగుతూ వందల టీఎంసీలకు చేరింది. ఈ నెల 11 నాటికి 34 టీఎంసీలు మాత్రమే బంగాళాఖాతంలోకి చేరాయి. 12న 32, 13న 106, 14న 130, 15న 133, 16న 161, 17న 204 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఇంకో రెండు మూడు రోజులు భారీ ఎత్తున నీళ్లు బంగాళాఖాతంలో చేరనున్నాయి. ఇక కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎగువన తెలంగాణకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ, దానికి దిగువన కురిసిన వర్షాలతో ఇప్పటి వరకు 13.45 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. ఈనెల 9వ తేదీ వరకు ప్రకాశం బ్యారేజీని దాటి చుక్క కృష్ణా నీరు కూడా సముద్రంలోకి వెళ్లలేదు. 

శ్రీశైలంలోకి మూడు రోజుల్లో 60 టీఎంసీలు

కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూరాల, తుంగభద్ర గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ఈ నెల 14న శ్రీశైలం ప్రాజెక్టుకు 31,736 క్యూసెక్కుల వరద చేరింది. ఆరోజు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వ 47.37 టీఎంసీలుగా ఉంది. 15న లక్ష క్యూసెక్కులు, 16న 2.54 లక్షలు, 17న 2.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటి నిల్వ 104 టీఎంసీలకు పెరిగింది. ఆదివారం రాత్రి వరకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో 3 లక్షలకు పైగా క్యూసెక్కులకు పెరగగా, నీటి నిల్వ 110 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో.. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ద్వారా 16 వేల క్యూసెక్కులను నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వదిలేస్తోంది. ఇక గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని ప్రాజెక్టులకు వరద తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు కడెంకు వరద పోటెత్తగా ఆదివారం చుక్క నీరు కూడా రాలేదు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి వరద భారీగా తగ్గింది. మేడిగడ్డ నుంచి సీతమ్మ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు దిగువ గోదావరిలో ఇంకా ప్రవాహం ఉధృతంగా ఉంది. మేడిగడ్డ, తుపాకులగూడేనికి 9 లక్షల క్యూసెక్కులకుపైగా, సీతమ్మ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 16 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదులుతున్నారు. శనివారం వరకు భద్రాచలం వద్ద మహోగ్రంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. ఇంకో రెండు రోజుల్లో వరద తీవ్రత మరింత తగ్గనుంది.