నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని 78 కిలోమీటర్ల పాదయాత్ర

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని 78 కిలోమీటర్ల పాదయాత్ర
  • నిజాం  షుగర్​  ఫ్యాక్టరీలు  తెరిపించాలని మహాపాదయాత్ర
  • నిజామాబాద్​ వరకు కొనసాగనున్న యాత్ర
  • మొదటి రోజు 20 కిలోమీటర్లు పూర్తి 
  • పసుపు, జొన్నలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్

మెట్ పల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాలని, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని, ఏకకాలంలో రుణమాఫీ  చేయాలని డిమాండ్​ చేస్తూ పార్టీలకు అతీతంగా రైతులు పోరుబాట పట్టారు. గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ  నుంచి నిజామాబాద్ మార్కెట్ వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ముత్యంపేటలో యాత్ర మొదలుకాగా వేంపేట్​ మీదుగా మెట్ పల్లి చేరుకుంది. వ్యవసాయ మార్కెట్ వద్ద కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, వాకిటి సత్యం రెడ్డి..రైతు నాయకులకు స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్ దగ్గర బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్ పుప్పాల లింబాద్రి సంఘీభావం తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించడంతో పాటు, పంటలకు బోనస్‌ ప్రకటించాలని రైతు నాయకులు డిమాండ్​ చేశారు. యాసంగి వడ్లు, మక్కలు సర్కారే  కొనాలన్నారు. జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి,  రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి,  నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురిజెల రాజారెడ్డి, ఐక్యవేదిక జిల్లా నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, శేర్ నర్సారెడ్డి , మారు మురళీధర్ రెడ్డి ,  కొప్పెల రాజా రెడ్డి,  కొట్టాల మోహన్ రెడ్డి , బందెల మల్లయ్య , ఏనుగు తిరుమల్ రెడ్డి   పాల్గొన్నారు.  డీఎస్పీ రవీందర్​రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
  
78 కిలోమీటర్లు సాగనున్న యాత్ర  
ముత్యంపేట నుంచి నిజామాబాద్ మార్కెట్ వరకు చేపట్టిన మహా పాదయాత్ర ఐదు రోజుల పాటు ..78 కిలోమీటర్లు కొనసాగనుంది. మొదటి రోజు ముత్యంపేట నుంచి ప్రారంభమైన  పాదయాత్ర మెట్‌పల్లి మీదుగా నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి వరకు 20 కిలోమీటర్లు సాగింది. రెండో రోజు నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మీదుగా అంకుశాపూర్ వరకు కొనసాగనుంది. మూడో రోజు అంకుశాపూర్​ నుంచి పెర్కిట్‌ మీదుగా ఆర్మూర్‌ కు చేరుతుంది. నాలుగోరోజు ఆర్మూర్‌లో మొదలై అంకాపూర్‌లో ముగిస్తారు. ఐదో రోజు అంకాపూర్‌ నుంచి నిజామాబాద్‌ పసుపు మార్కెట్‌ వరకు యాత్ర చేస్తారు. పసుపు  మార్కెట్ నుంచి నిజామాబాద్‌  కలెక్టరేట్‌ కు చేరుకుని కలెక్టర్ కు  వినతిపత్రం ఇస్తారు. పాదయాత్రలో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొంటారు. 

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ కు గుండెపోటు
నిజామాబాద్ కు తరలింపు
 
మహా పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ కోడిపల్లి గోపాల్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. గురువారం మహా పాదయాత్రలో పాల్గొన్న గోపాల్ రెడ్డి     మెట్ పల్లి శివారులోకి రాగానే అస్వస్థతకు గురయ్యారు. దీంతో బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి డాక్టర్ జేఎన్​ వెంకట్ ఆయనను కారులో మెట్ పల్లిలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. మార్గ మధ్యలో రెండోసారి గుండెపోటు వచ్చింది. తొందరగా చేర్పించడంతో గోపాల్ రెడ్డి ప్రాణాలు దక్కాయని వెంకట్ తెలిపారు.

ఢిల్లీ తరహా ఉద్యమాలు 
ఎప్పటినుంచో పసుపు సాగు చేస్తున్నాం. ధరలు తక్కువైనా పంట పండిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను పట్టించుకోవాలి. మద్దతు ధర కల్పించి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డు లేక ఎంత దిగుబడి తీసుకువచ్చినా..ధర లేక గిట్టుబాటు కావడం లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రారంభించాలి. ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించాలి.  మొదటి రోజు పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. సర్కారు స్పందించకుంటే రానున్న రోజుల్లో ఢిల్లీ తరహాలో ఉద్యమాలు చేస్తాం.    
-  పన్నాల తిరుపతి రెడ్డి, జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ప్రెసిడెంట్

షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి రోడ్డున పడేసిన్రు  
నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మూసివేసి చెరుకు రైతులను, కార్మికులను రోడ్డున పడేసింది. పూర్వ వైభవం తెస్తామన్న సర్కారు.. ఫ్యాక్టరీ ఉనికి లేకుండా చేసింది. పరిశ్రమల రీ ఓపెన్ కోసం ఏడేండ్లుగా ఉద్యమాలు చేస్తున్నా స్పందించడం లేదు. ఫ్యాక్టరీలు ప్రారంభించేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తాం.  
 - మామిడి నారాయణ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ప్రెసిడెంట్ 

పసుపు పంటకు మద్దతు ధర ఇయ్యలే 
పసుపుకు మద్దతు ధర లేక రైతులు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోతున్నారు. పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర కల్పించడంతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీ ఓపెన్​ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇవి నెరవేరేంతవరకు పోరాటాలు ఆపేది లేదు. దీని గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తాం. రైతులపై కపట ప్రేమ చూపెడుతున్న టీఆర్ఎస్ సర్కారుకు రానున్న రోజుల్లో రైతులు గుణపాఠం చెబుతారు.
-  బద్దం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా  రైతు ఐక్యవేదిక  కన్వీనర్