హైదరాబాద్ లో ఫేక్ డాక్యుమెంట్లతో భూముల కబ్జా

హైదరాబాద్ లో ఫేక్ డాక్యుమెంట్లతో భూముల కబ్జా
  •     ఓనర్లు చనిపోయినట్టు నకిలీ​ డెత్ ​సర్టిఫికెట్ల సృష్టి  
  •     8 మంది అరెస్ట్.. నిందితుల్లో ఏఎస్ఐ

మల్కాజ్ గిరి/కీసర, వెలుగు: ఖాళీగా ఉండి, యజమానులు అందుబాటులో లేని భూములను నకిలీ పత్రాలతో కాజేస్తున్న ఓ ముఠాను కీసర రాచకొండ ఎస్‌ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా, ఇందులో మోటకొండూరు పీఎస్​లో ఏఎస్ఐ గా పని చేస్తున్న అధికారి కూడా ఉండటం గమనార్హం. వివరాలను మల్కాజిగిరి కమిషరేనట్​లో డీసీపీ చక్రధర్, ఏసీపీ చక్రపాణి, సీఐ ఆంజనేయులు మీడియాకు వెల్లడించారు. 

8 మంది గల ఈ ముఠా ఖాళీగా ఉన్న భూముల అసలు యజమానుల వివరాలు సేకరిస్తుంది. వారు చనిపోయినట్టు ఫేక్​డెత్​సర్టిఫికెట్లు తయారు చేస్తుంది. తర్వాత నకిలీ వారసులను సృష్టించి, గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్లు, సేల్ డీడ్ల ద్వారా ఆ ఆస్తులను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ఇలా ఇప్పటివరకు ఫేక్​డాక్యుమెంట్లతో దాదాపు రూ.5 కోట్లకు పైగానే సంపాదించారు. 

ఈ నెల 16, 17 తేదీల్లో ఇద్దరు మహిళలు తమ ప్లాట్లను ఫోర్జరీ పత్రాలతో సేల్ డీడ్ చేశారని, తమ భూములు వేరే వాళ్ల పేర్ల మీదకు బదిలీ అయ్యాయని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు గుట్టు బయటపడింది. యాదాద్రి జిల్లా మోటకొండూరు ఏఎస్ఐ కనకాటి లింగయ్య గౌడ్తోపాటు ఇతర నిందితులైన ప్రవీణ్ రెడ్డి, మోడెమ్ సంపత్, కాంబ్లే దీప, ఉప్పల వేణు, దొనపాటి వెంకట్ రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యను అరెస్ట్​చేశారు. నిందితులు సృష్టించిన నకిలీ పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.