వీటిలో మ్యుటేషన్లు జరిగితే.. వీర్యం ఉత్పత్తి తగ్గుతది

వీటిలో మ్యుటేషన్లు జరిగితే.. వీర్యం ఉత్పత్తి తగ్గుతది

ఉప్పల్, వెలుగు:  మగవాళ్లలో ఫర్టిలిటీకి అతి కీలకమైన 8 కొత్త జీన్స్ (జన్యువులు) ను హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సైంటిస్టులు కనుగొన్నారు. ఈ జన్యువుల్లో మార్పులు (మ్యుటేషన్లు) జరగడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోయి మగవాళ్లలో ఇన్ ఫర్టిలిటీ సమస్య వస్తోందని వీరు గుర్తించారు. దేశంలోని పలు ప్రముఖ సంస్థల సైంటిస్టులతో కలిసి చేపట్టిన ఈ పరిశోధనకు నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ) డైరెక్టర్ డాక్టర్ కె. తంగరాజ్ లీడ్ ఇన్వెస్టిగేటర్ గా పని చేశారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.  

1,547 మందిపై స్టడీ.. 

‘‘పరిశోధనలో భాగంగా.. సంతానలేమితో బాధపడుతున్న 47 మంది మగవాళ్లలో 30 వేల జీన్స్ ను నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్ధతిలో సీక్వెన్స్ చేసి పరిశీలించాం. ఆ తర్వాత ఫలితాలను నిర్ధారించుకునేందుకు  దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో1500 మంది సంతానలేమి సమస్య ఉన్న మగవాళ్ల జన్యువులనూ అధ్యయనం చేశాం. దీంతో ఈ 8 జన్యువుల్లో మ్యుటేషన్లు జరిగితే ఇన్ ఫర్టిలిటీకి దారితీస్తున్నట్లు తేలింది” అని సీసీఎంబీ పీహెచ్డీ స్టూడెంట్, స్టడీకి లీడ్ ఆథర్ గా వ్యవహరించిన డాక్టర్ సుధాకర్ దిగుమర్తి తెలిపారు. ఈ స్టడీలో వెల్లడైన వివరాలు ఇన్ ఫర్టిలిటీ చికిత్సకు ఉపయోగపడతాయని, సంతానలేమి సమస్య ఉన్న మగవాళ్లలో ఈ జన్యువులు సరిగ్గా ఉన్నాయా? లేవా? అని పరిశీలిస్తే.. సమస్యను గుర్తించొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు జంట్లలో ఒక జంట సంతానలేమి సమస్యను ఎదుర్కొంటోందని, వీరిలో దాదాపు సగం మంది పురుషుల్లో ఫర్టిలిటీ సమస్యలు ఉంటున్నాయని అంచనా.

ఆ జన్యువులు ఇవే.. 

మగవాళ్లలో ఫర్టిలిటీకి ముఖ్యమైన బీఆర్డీటీ, సెంట్రిన్1, కాట్స్ పెర్డ్, జీఎంసీఎల్1, స్పాటా6, టీఎస్ఎస్కే4, టీఎస్కేఎస్, జెడ్ఎన్ఎఫ్318 అనే కొత్త జన్యువులను తమ పరిశోధనలో గుర్తించామని డాక్టర్ తంగరాజ్  వెల్లడించారు. ఈ జన్యువుల్లో మ్యుటేషన్లు జరిగిన వ్యక్తుల్లో వీర్యం ఉత్పత్తి లోపించి, మేల్ ఇన్ ఫర్టిలిటీకి దారి తీస్తున్నట్లు తేలిందన్నారు. ఉదాహరణకు సెంట్రిన్ 1 అనే జన్యువులో మ్యుటేషన్ జరిగితే.. వీర్య కణాల ఉత్పత్తికి అవసరమైన సెల్ డివిజన్ నిలిచిపోతుందని, దీంతో తగినంత వీర్యం ఉత్పత్తి కాదన్నారు. సంతానలేమితో బాధపడుతున్న జంటల్లో సగం వరకూ మగవాళ్లలో లోపాలు ఉంటున్నాయని, వీరిలో చాలా మంది సంతానలేమికి కారణం జన్యులోపాలేనని ఆయన స్పష్టం చేశారు.