
- 10 లక్షల దరఖాస్తులు రాగా మూడు కేటిగిరీల కింద విభజన
- ఎల్1 కింద 18వేల మందికి స్థలాలున్నట్లు గుర్తింపు
- ఎల్3 కింద లక్ష మందికి పైగా అనర్హులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో జీహెచ్ఎంసీ నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో 8 లక్షల మందికి ఇండ్లు, జాగాలు లేవని తేలింది. ఇండ్ల కోసం 10,66,953 మొత్తం దరఖాస్తులు రాగా, వీటిని మూడు కేటగిరీల కింద విభజించారు. లెవెల్–1 కింద ఇండ్ల నిర్మాణానికి ప్లాట్లు ఉన్నవారి లెక్క తీయగా 18 వేల మంది అర్హులుగా తేలారు. లెవెల్–2 కింద ఇండ్లు, జాగా లేనివారు 8.80 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. లెవెల్–3 కింద ఇండ్లు ఉన్న 1.75 లక్షల మందిని గుర్తించి అనర్హులుగా తేల్చారు.
వీరు కూడా అనర్హులే..
ఏడాది కింద నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. బల్దియా అధికారులు సర్వేకు వెళ్లగా పాత అడ్రస్‌లో చాలా మంది కనిపించలేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు తెలిసింది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలామందివి కలవలేదు. ఇంకొందరు ఊర్లలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్టు చెప్పడంతో అనర్హుల జాబితాలో చేర్చారు. వీరితో పాటు అపార్ట్ మెంట్లలో ఉంటున్నవారు, ఇంటి యజమానులను నాట్ ఎలిజిబుల్ కింద చేర్చారు.
ఇండ్లు, స్థలాలు లేనివారే ఎక్కువ..
.గ్రేటర్ లో ఇండ్లు, స్థలాలు లేనివారే ఎక్కువ మంది ఉండడంతో వీరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకులేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి జిల్లాల్లో రూ.5 లక్షలు ఇస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆలస్యం కావడంతో ఇంకా ఈ స్కీమ్ మొదలుకాలేదు. ప్రస్తుతమైతే సొంత జాగా ఉన్నవారు కేవలం18 వేల మంది మాత్రమే ఉండడంతో వీరికి ఇండ్లు కట్టించే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంతిళ్లు, జాగలు లేనివారు 80 శాతం మంది ఉండడంతో ప్రభుత్వం తమ విషయంలో వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు .
నాలుగు జిల్లాల్లో కలిపి
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా, హైదరాబాద్ జిల్లాల్లో సొంత జాగాలున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం18 వేల మంది అర్హులను గుర్తించగా, ఇందులో హైదరాబాద్ జిల్లాలో కేవలం 4వేల మంది మాత్రమే ఉన్నట్టు తేల్చారు. మిగిలిన వారంతా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నారు. అలాగే ఇండ్లు, జాగలు లేనివారు 8.80 లక్షలమంది ఉండగా, హైదరాబాద్ జిల్లాలో 4,22,300 మంది ఉన్నారు. మిగతా 50 శాతంలో మూడు జిల్లాల వారు ఉన్నారు. రిజెక్ట్అయిన వారిలో 52వేల దరఖాస్తులు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవే ఉన్నాయి.