నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు 8 మందికి ఏడాది జైలు శిక్ష

నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు 8 మందికి ఏడాది జైలు శిక్ష

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ కేసు విషయంలో అసలు ముద్దాయికి బదులు నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు గాను, 8 మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్​ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ వి.శివనాయక్​ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. 2010లో ఇరుపక్షాలు కొట్టుకున్న కేసు 2013లో ఫైనల్​కు వచ్చింది. తీర్పు ఇచ్చే టైంలో అసలు ముద్దాయికి బదులు మరో వ్యక్తి కోర్టుకు హాజరవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్పటి ఇన్స్​పెక్టర్​ కోర్టుకు సమాచారం ఇచ్చారు. కోర్టుకు హాజరైన ముద్దాయిలను రెండు సార్లు అడిగితే వారు మౌనంగా ఉండడంతో అప్పటి మొదటి అదనపు జ్యుడీషియల్​ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ ఎం.కిరణ్మయి వాళ్ల పూర్తి వివరాలు, ఆధార్​ కార్డులతో సహా అందించాలని కోర్టు కానిస్టేబుల్​ను ఆదేశించారు.

 కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలోనే  గోనేమల్ల నాగరాజు దుబాయ్​ వెళ్లిపోయాడు. ఆధార్​ కార్డులను పరిశీలించగా, నాగరాజు స్థానంలో చిత్తారి సూర్యనారాయణ అటెండ్​ అవుతున్నట్లు గుర్తించారు. నాగరాజు స్థానంలో తాను హాజరైనట్లు చిత్తారి సూర్యనారాయణ అంగీకరించాడు. దీంతో జడ్జి కిరణ్మయి 2013, సెప్టెంబర్​లో వన్​టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జి షీట్​ దాఖలు చేశారు. 12 మంది సాక్షులను విచారించిన అనంతరం ఎనిమిది మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. జడ్జి ముందు నకిలీ ముద్దాయిని ప్రవేశపెట్టినందుకు లాయర్​ దుర్గారావుకు కూడా శిక్ష విధించారు. ఏపీపీవో ఎన్.లావణ్య ప్రాసిక్యూషన్​  నిర్వహించారు.