నదులు మురికివడ్తున్నయ్

నదులు మురికివడ్తున్నయ్
  • రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో సహా 8 నదులు కలుషితం  
  • ఇండస్ట్రీల వ్యర్థాలు.. ట్రీట్​మెంట్ చేయని మురుగు నీరే కారణం  
  • రాష్ట్రంలో మురుగు నీరు ట్రీట్​మెంట్ 27 శాతమే 
  • అత్యధికంగా మహారాష్ట్రలో 53 నదులు పొల్యూట్ 
  •  పార్లమెంటుకు సీపీసీబీ నివేదిక

హైదరాబాద, వెలుగు:  రాష్ట్రంలో మూసీ నది మాత్రమే కాదు గోదావరి, కృష్ణా నదులు కూడా కలుషితం అవుతున్నాయి. వీటితో సహా రాష్ట్రంలో మొత్తం ఎనిమిది నదులు మురుగు నీళ్లతో పొల్యూట్ అవుతున్నయి. దేశంలోని నదుల్లో పొల్యూషన్ అంశంపై పార్లమెంటుకు సెంట్రల్​ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఇచ్చిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా351 ప్రాంతాల్లో నదులు కలుషితం కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 53 నదులు పొల్యూట్ అయినట్లు సీపీసీబీ పేర్కొంది. రాష్ట్రంలో మూసీ, మంజీరా, నక్కవాగు, కరకవాగు, మానేరు, గోదావరి, కృష్ణా, కిన్నెరసాని నదులు పొల్యూటెడ్ లిస్ట్​లో చేరాయి. గతంలో నాలుగు నదులే కలుషితం కాగా, ఇప్పుడు మరో నాలుగు నదులు పొల్యూట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. మురుగు నీరు పెరిగిపోవడం, ఇండస్ట్రీల నుంచి వ్యర్థాలు నదుల్లోకి చేరడం, ప్రమాదకరమైన ఫాస్పేట్, మెడిసిన్ కెమికల్స్ తో నదుల్లో కాలుష్యం పెరుగుతోంది. దీని ఫలితంగా నదుల సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజల ఆరోగ్యం, పశువులు, ఎన్విరాన్​మెంట్​పై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నట్లు ఇప్పటికే వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. మురుగు నీరును పూర్తిగా ట్రీట్​మెంట్ చేయకపోవడం వల్లే సమస్య ఎక్కువవుతోందని నిపుణులు చెప్తున్నరు. నదుల నుంచి ఈ పొల్యూషన్ క్రమంగా చెరువులు, కాలువలు, భూగర్భ జలాల వరకూ చేరుతోందని పేర్కొంటున్నరు.   
రోజూ195 కోట్ల లీటర్ల మురుగు నీరు నదుల్లోకి
పట్టణాల నుంచి వస్తున్న మురుగు నీటితోనే నదులు ఎక్కువగా కలుషితం అవుతున్నట్లు సీపీసీబీ వెల్లడించింది. పెరుగుతున్న నీటి వాడకానికి అనుగుణంగా మురుగునీటి ట్రీట్​మెంట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. మురుగు నీటిని కొంత వరకే  ట్రీట్​మెంట్ చేసి వదులుతుండటంతో.. మిగిలినదంతా గోదావరి, కృష్ణా, మూసీ, మానేరు, కిన్నెరసాని, మంజీరా వంటి నదులు, ఇతర నీటి వనరుల్లో కలుస్తోంది. ఫలితంగా భూగర్భ, ఉపరితల జలాలు కూడా కలుషితమవుతున్నయి. రాష్ట్రంలో రోజూ సగటున 266  కోట్ల లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంటే 35 శాతం మాత్రమే  వాటర్​  ట్రీట్​మెంట్  చేసే కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లోనూ 27 శాతం వరకే  ట్రీట్​మెంట్ చేస్తున్నరు. దాదాపు195.4 కోట్ల లీటర్ల మురుగు నీరు నదుల్లో కలుస్తోంది. ఇక ఇంటి అవసరాలకు వాడుతున్న నీటిలో 80 శాతం వృథాగా వెళుతోందని నివేదిక తెలిపింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, కమిటీల సహకారంతో నదుల్లో పొల్యూషన్ తగ్గించేలా ప్లాన్ చేయాలని సూచించింది. వాటర్​  ట్రీట్​మెంట్ ప్లాంట్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సీపీసీబీ పేర్కొంది.