ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు

ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు

సమాచారాన్ని తర్వగా చేరవేయడంలో సామాజిక మాధ్యమాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో యూట్యూబ్ చానెళ్లు ముందు వరుసలో ఉన్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ప్రజలకు వీడియోల రూపంలో చేరవేస్తుంది. మంచి అయినా..చెడు అయినా వెంటనే తెలిసిపోతుంది. కానీ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక ప్రజలను పక్కదారి పట్టిస్తు్న్నారు. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు వేసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ మత విధ్వేషాలను రెచ్చగొడుతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకుంది. 

నకిలీ​వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తప్పుడు కథనాలు, పోస్టులు చేస్తూ.. వైరల్​ చేస్తున్న పలు యూట్యూబ్​ఛానళ్లపై కొరడా ఝులిపించింది. తాజాగా మరో 8 యూ ట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. నిషేధం విధించిన వాటిలో ఏడు ఛానళ్లు భారత్ కు చెందినవి కాగా..మరొకటి దాయది దేశం పాకిస్తాన్ కు చెందినది. నిషేధం విధించిన ఆయా ఛానళ్లకు మొత్తం 85 లక్షల మంది సబ్​ స్క్రైబర్స్​ ఉన్నట్లు అంచనా. ఈ ఛానెళ్లలో వచ్చిన వీడియోలను దాదాపు 114 కోట్లకు పైగా వీక్షించినట్లు కేంద్రం అంచనా వేసింది. 

దేశంలో కొన్ని వర్గాల మధ్య మత విధ్వేషం పెచ్చరిల్లేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మతపరమైన కలహాలు సృష్టించే విధంగా వీడియోలు తయారు చేయడం, వదంతులతో పాటు అసత్య  ప్రచారాలకు పాల్పడుతున్నాయని తెలిపింది. దీని కారణంగా ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. పలు న్యూస్​ ఛానళ్లకు చెందిన లోగోలు.. వ్యూయర్స్​ను ఆకర్షించే విధంగా థంబ్​ నెయిల్​ వాడడం చేస్తున్నాయని పేర్కొంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్​, భారత ఆర్మీపై తప్పుడు అంశాలను ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. మొత్తంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కేంద్రం 102 యూట్యూబ్​ఛానళ్లను బ్లాక్ చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపరిచేలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్​ న్యూస్​ ప్రసారం చేసే ఛానళ్లపై  కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.