పైన పశువుల దాణా..  కింద గంజాయి

పైన పశువుల దాణా..  కింద గంజాయి
  • లారీలో తరలిస్తున్న 800 కిలోల గంజాయి సీజ్
  • ఏపీ టు యూపీ వయా హైదరాబాద్ 
  • శంషాబాద్​ పరిధిలో ఓఆర్​ఆర్ సర్వీస్​ రోడ్డు దగ్గర తనిఖీలు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో మరో ముగ్గురు

గచ్చిబౌలి, వెలుగు: లారీలో పైన పశువుల దాణా(పత్తి గింజల పొట్టు) సంచులు పెట్టి, వాటి కింద గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్​ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి హైదరాబాద్​ మీదుగా ఉత్తరప్రదేశ్​కు గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం ఉదయం శంషాబాద్​ ఎస్​వోటీ, శంషాబాద్​ పోలీసులు పెద్ద గోల్కొండ​ఎక్స్​ రోడ్​లోని ఓఆర్ఆర్​ సర్వీస్​ రోడ్డులో లారీ(ఏపీ07టీఎం7596)ని ఆపి తనిఖీలు చేశారు. లారీలో దాణా బస్తాల కింద తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన 800 కిలోల గంజాయిని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, లారీ, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. 
 

రాజమండ్రి ఏజెన్సీ నుంచి..
ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్​ జిల్లాకు చెందిన సికిందర్​ గంజాయి  అమ్ముతుంటాడు. అదే రాష్ట్రంలోని మధుర జిల్లాకు చెందిన బిజేందర్​సింగ్​కు లారీలు ఉన్నాయి. ఇతని వద్ద మీరట్​ జిల్లా శేవై గ్రామానికి చెందిన ఖుషీ మహమ్మద్(34) డ్రైవర్​గా.. మధుర జిల్లా బడిఅట్టాస్​ గ్రామానికి చెందిన సోను సింగ్(23) క్లీనర్​గా పనిచేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్​గిరికి చెందిన సోము గంజాయి సప్లయ్​ చేస్తుంటాడు. సోము నుంచి సికిందర్​ గంజాయి సేకరించి లారీలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి రవాణా చేసి అమ్ముతున్నాడు. రెండు వారాల క్రితం సికిందర్.. సోమును సంప్రదించి 800 కేజీల గంజాయి ఆర్డర్​ ఇచ్చాడు. ఈ నెల 6న లారీ డ్రైవర్​ ఖుషీ మహమ్మద్, క్లీనర్​ సోను సింగ్​పత్తి గింజల పొట్టు లోడ్​తో ఉన్న లారీ తీసుకుని విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరారు. వారు సోముకు కాల్​ చేయగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వారిని రాజమండ్రి సమీపంలోని ఏజెన్సీ ఏరియాకు తీసుకువెళ్లాడు. అక్కడికి రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఒక్కొక్కటీ 12.5 కేజీలు ఉన్న 64 గంజాయి ప్యాకెట్లను వారికి ఇచ్చారు. గంజాయి ప్యాకెట్లను లారీ అడుగున పెట్టి పైన పత్తి గింజల పొట్టు బస్తాలను ఉంచారు. ఆ తర్వాత హైదరాబాద్​ మీదుగా ఉత్తరప్రదేశ్​బయలుదేరారు. రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెట్టడంతో సికిందర్​ సూచన మేరకు లారీని టోల్​ గేట్లు లేని మార్గాల్లో తీసుకెళ్లారు. అయితే గంజాయి తరలింపునకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లోని పెద్ద గోల్కొండ ఎక్స్​ రోడ్​లోని ఓఆర్​ఆర్​ సర్వీస్​ రోడ్డు దగ్గర శంషాబాద్​ ఎస్​వోటీ, శంషాబాద్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పత్తిగింజల పొట్టు బస్తాలతో వస్తున్న లారీని ఆపి చెక్​ చేశారు. డ్రైవర్​ ఖుషీ మహమ్మద్, క్లీనర్​ సోనుసింగ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా విషయం బయటపడింది. దీంతో 800 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సికిందర్, బిజేందర్​సింగ్, సోము పరారీలో 
ఉన్నట్లు పోలీసులు తెలిపారు.