టీచర్ల బదిలీలకు 81 వేల మంది అప్లయ్‌‌‌‌

టీచర్ల బదిలీలకు 81 వేల మంది అప్లయ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీల కోసం దరఖాస్తు గడువు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి వరకు మొత్తం 81,069 మంది అప్లయ్‌‌‌‌ చేసుకున్నారు. ఇందులో కొత్తగా దరఖాస్తు చేసుకున్న టీచర్లు 6,968 మంది ఉండగా, ఫిబ్రవరిలో దరఖాస్తు చేసిన వారు 74,101 మంది ఉన్నారు. కాగా, గతంలో అప్లయ్‌‌‌‌ చేసుకున్న వారిలో 70,762 మంది వారి అప్లికేషన్లను సవరించుకున్నారు. మొత్తం అప్లికేషన్లలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 4,722, నల్గొండలో 4,416, నిజామాబాద్‌‌‌‌లో 4,088, సంగారెడ్డిలో 4,038 మంది దరఖాస్తు చేయగా, తక్కువగా ములుగులో 781 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 1,068 మంది అప్లయ్‌‌‌‌ చేసుకున్నారు. 

అయితే, కొత్తగా వచ్చిన 6,968 అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 467 మంది అప్లయ్‌‌‌‌ చేశారు. దరఖాస్తు కాపీలను ఈ నెల 7లోగా డీఈఓ ఆఫీసుల్లో ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత 8, 9 తేదీల్లో సీనియార్టీ లిస్టులను డీఈఓ/ఆర్జెడీ వెబ్‌‌‌‌సైట్లలో పెడతారు. 10, 11 తేదీల్లో ఈ లిస్టులపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి, 12, 13 తేదీల్లో సీనియార్టీ లిస్టులను డీఈఓ ఆఫీసుల్లో డిస్‌‌‌‌ప్లే చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, హెడ్మాస్టర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది. 

పాయింట్లు కలిపేందుకు చర్యలు..

టీచర్ల బదిలీల దరఖాస్తు ప్రక్రియ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌‌‌‌వేర్ ప్రాబ్లమ్‌‌‌‌తో జీవో 317 ద్వారా ఎఫెక్ట్ అయిన టీచర్లకు ఒక నెలకు సంబంధించిన 0.25 పాయింట్లు కలవడం లేదు. ఒక నెలలో 25 రోజులు.. మరో నెలలో 5 రోజులు పని చేయడంతో, ఈ నెల పాయింట్లు టీచర్లకు యాడ్ కావడం లేదు. అయితే, రాష్ట్రంలో జీవో 317 ద్వారా 25 వేల మంది వరకు ఎఫెక్ట్‌‌‌‌ కాగా, వీరిలో పది వేల మంది బదిలీలకు దరఖాస్తు చేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అయితే, సాఫ్ట్‌‌‌‌వేర్ ప్రాబ్లమ్‌‌‌‌తో 0.25 పాయింట్లు కావడం లేదని, త్వరలోనే దాన్ని అప్‌‌‌‌డేట్ చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్కో టీచర్ రెండు మూడు జిల్లాలు మారడంతోనే ఈ సమస్య వచ్చిందని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 0.25 సర్వీస్ పాయింట్ యాడ్ కాని వారికి, త్వరలో కలుపుతామని వెల్లడించారు.