బతుకుబండి కదిలింది..

బతుకుబండి కదిలింది..

మళ్లీ రాష్ట్రంలో జనం లైఫ్​ మామూలైంది. లాక్​డౌన్​తో దాదాపు నెల రోజులుగా ఖాళీగా కనిపించిన రోడ్లన్నీ గురువారం నుంచి సడలింపులు ఇవ్వడంతో వాహనాలు, జనంతో కిటకిటలాడాయి. షాపులు, స్ట్రీట్​ఫుడ్ సెంటర్లు తెరుచు కున్నాయి.  మార్కెట్లలో మస్త్ రష్ కనిపించింది. చిరువ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. . హైదరాబాద్​లో  85% వాహనాలు రోడ్డెక్కాయి.

హైదరాబాద్/ నెట్ వర్క్​, వెలుగు: లాక్​డౌన్​తో దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో ఖాళీగా కనిపించిన రోడ్లన్నీ గురువారం వాహనాలు, జనంతో కిటకిటలాడాయి. లాక్ డౌన్ సడలింపులతో బిజినెస్ లు, షాపులు, స్ట్రీట్​ఫుడ్ సెంటర్లన్నీ తెరుచుకున్నాయి. అన్ని సిటీలు, పట్టణాల్లోని మార్కెట్లలో మస్త్ రష్ కనిపించింది. చిరువ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పెట్టిన మొదట్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపులు ఉండటం, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు రిలాక్సేషన్ ఇచ్చినా పెద్దగా బిజినెస్ జరగలేదని వ్యాపారులు చెప్పారు. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇవ్వడంతో అందరూ అన్ని పనులు చేసుకునే అవకాశం కలిగిందన్నారు. 

మునుపటి సీన్లు

చాలా రోజుల తర్వాత పొద్దున్నుంచి మాపటి దాకా పనులు, బిజినెస్ లు చేసుకునే అవకాశం రావడంతో గ్రేటర్​ హైదరాబాద్​లో మళ్లీ మునుపటి సీన్ కనిపించింది. లాక్​డౌన్​ పెట్టిన మొదట్లో నాలుగు గంటలు, ఆ తర్వాత ఎనిమిది గంటలు సడలింపులు ఇచ్చినప్పటికీ బిజినెస్​లు సక్కగ నడవలేదన్నారు. తెచ్చిన సరుకు అమ్ముడుపోక ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు టైమ్ పెంచడంతో గిరాగీ అవుతుందన్న నమ్మకం వచ్చిందంటున్నారు. మొదటి రోజు గిరాకీ తక్కువగానే అయినా ఒకటి రెండు రోజుల్లో పుంజుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత లాక్ డౌన్ ఉండటంతో ఫుడ్ బిజినెస్ పై ఎఫెక్ట్ ఉంటుందని ఉపాధి పొందుతున్న వారంటున్నారు.

85 శాతం రోడ్డెక్కిన వెహికల్స్

లాక్ డౌన్ సడలింపులతో గురువారం సిటీ రోడ్లన్ని బిజీగా మారాయి.  పొద్దున 7 గంటల నుంచే ప్రభుత్వ, ప్రైవేట్ ద్యోగుల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్స్‌‌, బైక్స్‌‌, కార్లతో హైదరాబాద్ రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. ‘‘ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటర్ అండ్ క్లాసిఫికేషన్’’ సిస్టమ్‌‌తో పోలీసులు ట్రాఫిక్‌‌ ను ఎట్ల సాగుతుందనేది పర్యవేక్షించారు. సిటీలో 85శాతం వాహనాలు రోడ్డెక్కినట్లు గుర్తించారు. బేగంపేట్, సికింద్రాబాద్, కూకట్‌‌పల్లి, నల్లగొండ క్రాస్ రోడ్స్, లక్డీకపూల్‌‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, పంజాగుట్ట ఏరియాల్లో రోజంతా రద్దీ కొనసాగింది. సాయంత్రం 4  గంటల నుంచి 6 గంటల వరకు సిటీ రోడ్లపై ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది.

నెల తర్వాత తెరిచిన

10 రోజుల కింది వరకు మధ్యాహ్నం 1 గంట దాకా సడలింపులు ఇచ్చినా ఆ టైమ్ లో ఫాస్ట్ ఫుడ్ కు గిరాకీ ఉండదు. అందుకే నెలరోజులుగా సెంటర్​ను మూసేశాను. ఇంటి రెంట్ కట్టేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇవ్వడంతో బిజినెస్ అవుతుందన్న నమ్మకంతో సెంటర్ తెరిచా.
- కృష్ణ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్