
పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 86 మంది చనిపోయారు. తరన్ తరన్, అమృత్ సర్, బటాలా జిల్లాలకు చెందిన పలువురు కల్తీ మద్యం తాగి చనిపోయిన వారిలో ఉన్నారు. అత్యధికంగా తరన్ తరన్ జిల్లాలోనే 63 మంది మృతి చెందగా.. అమృత్ సర్‌లో 12 మంది, గురుదాస్‌పూర్ బటాలాలో 11 మంది చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. నిందితులు ఎవరైనా వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.
జలంధర్ డివిజన్ కమీషనర్ నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులను కోరారు. అకాలీదళ్-బీజేపీ పాలనలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయని ఆయన అన్నారు. గురుదాస్‌పూర్ మరియు బటాలాలో 2012 మరియు 2016లలో ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ కేసులలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని.. బాటాలా సంఘటనలో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా.. ప్రధాన నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. శిరోమణి అకాలీదళ్ కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేయాలి. అక్రమ మద్యం వ్యాపారం కోసం మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చినందు వల్లే ఈ ఘటన జరిగింది. దీనిక సంబంధించిన మంత్రులు మరియు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సహా దోషులందరినీ అరెస్టు చేయాలి. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదేశించిన మెజిస్టీరియల్ దర్యాప్తును రద్దు చేసి.. హైకోర్టు న్యాయమూర్తి స్వతంత్ర దర్యాప్తు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
షాంబు సరిహద్దు, రాజ్‌పురా మరియు పాటియాలా చుట్టుపక్కల ప్రాంతంలోని వివిధ గ్రామాలు, ధాబాలు మరియు రోడ్ల పక్కన మద్యం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు డైరెక్టర్ దినకర్ గుప్తా తెలిపారు. ఈ ఘటన జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని భావిస్తూ.. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
For More News..