
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ సీజన్‌లో రాష్ట్రంలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 89 కోట్ల చేప పిల్లలను వదలనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పోరిక బలరాంనాయక్, రఘురామిరెడ్డితో కలిసి ఆదివారం పాల్వంచలోని భద్రాద్రి కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ చేపల పెంపకంపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించి, వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి పారుతుండడంతో ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై అవసరమైతే కేసులు పెట్టాలని సూచించారు. కేంద్రం నుంచి యూరియా సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. వర్షాకాలం పూర్తయ్యేంత వరకు కంట్రోల్‌రూంను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేంద్రమోహన్, కార్పొరేషన్ చైర్మన్లు పొదెం వీరయ్య, మువ్వా విజయ్ బాబు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, దురిశెట్టి అనుదీప్, ఎస్పీ బి.రోహిత్ రాజు పాల్గొన్నారు.
30 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ : వాకిటి శ్రీహరి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను 25 నుంచి 30 ఎకరాల్లో ఏర్పాటు చేసేలా కలెక్టర్లు, ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ సీజన్‌లో ఆగస్ట్‌లోనే చేపపిల్లలను వదిలేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, ఇందుకోసం రూ. 120 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని చెప్పారు. ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
పోడు సాగుదారులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఎప్పటి నుంచో పోడు సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మేజర్ పంచాయతీల్లో పదేండ్లలో ఎన్ని మొక్కలు నాటారు ? అందులో ఎన్ని బతికాయి ? వీటి కోసం ఎంత ఖర్చు చేశారు ? అన్న వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మీటింగ్‌లో అడిగే ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇవ్వడం సరికాదని, సమగ్ర వివరాలతో మీటింగ్‌కు రావాలని ఆఫీసర్లను మందలించారు.
సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి : తుమ్మల నాగేశ్వరరావు
ఆఫీసర్లు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి ముందుకు సాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, సరిపడినంత యూరియా నిల్వ ఉందన్నారు.