తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి..

తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి..

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా సాగుతున్నాయి. బుధవారం ( అక్టోబర్ 1 ) బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

ఇదిలా ఉండగా... బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన గురువారం ( అక్టోబర్ 2 ) ఉద‌యం 6 గంటల నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామిపుష్క‌రిణిలో స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది. వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.