కరోనా మహమ్మారి సైనిక బలగాలనూ కాటేస్తోంది. శనివారం ఒక్క రోజే తొమ్మిది మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ఏడు కేసులు ఢిల్లీలో, మరో రెండు కేసులు త్రిపురలో నమోదయ్యాయి. దేశ రాజధానిలో శాంతి భద్రతల రక్షణలో ఢిల్లీ పోలీసులకు సాయంగా డ్యూటీలో ఉన్న ఏడుగురు జవాన్లకు వైరస్ సోకినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. వారందరికీ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
10 రోజుల క్రితం కరోనా ఫ్రీగా స్టేట్ గా ప్రకటించిన సీఎం
త్రిపుర రాష్ట్రంలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకిందని శనివారం వెల్లడించారు ఆ రాష్ట్ర సీఎం విప్లవ్ కుమార్ దేవ్. రాష్ట్రంలోని ధలియా జిల్లా అంబాసాలోని ఆస్పత్రిలో మార్చి 25న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తీవ్రమైన కడుపు నొప్పితో అడ్మిట్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం అగర్తల లోని జీబీ పంత్ హాస్పిటల్ కు తరలించారు. అతడి బాగోగులు చూసేందుకు అటెండెంట్ మరో బీఎస్ఎఫ్ జవాన్ ను నియమించారు అధికారులు. కొద్ది రోజులగా వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యలు టెస్టులు చేశారు. వైరస్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే త్రిపురలో ఏప్రిల్ తొలి వారంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం కోలుకుని.. ఏప్రిల్ 16న ఆ ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు కొత్తగా కేసులు రాకపోవడంతో రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ స్టేట్ గా ప్రకటించారు సీఎం విప్లవ్ దేవ్. అయితే ఇవాళ ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు వైరస్ సోకడంతో కరోనా ఫ్రీగా ఉన్న రాష్ట్రంలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా ఎలా వచ్చింది? ఎవరి నుంచి వైరస్ సోకిందన్న లింక్ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు మొత్తం 17 మంది జవాన్లకు వైరస్ సోకినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
