మోడీ నీతి ఆయోగ్ మీటింగ్ కు.. హాజరుకాని సీఎంలు వీరే

మోడీ నీతి ఆయోగ్ మీటింగ్ కు.. హాజరుకాని సీఎంలు వీరే

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన.. 2023, మే 27వ తేదీ శనివారం జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. వివిధ కారణాలతో హాజరుకాలేకపోయినట్లు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రకటించారు. సమావేశానికి డుమ్మా కొట్టిన తొమ్మిది మంది ముఖ్యమంత్రులు వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలోని నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరుకాలేదు. అయితే ఈ ముగ్గురు సీఎంలు హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. రాష్ట్రాల నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ ఈ  ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు.

అదే విధంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం గైర్హాజరు అయ్యారు. హాజరుకావటం లేదనే అందరి కంటే ముందే ప్రకటించారమె. 
ఇక రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరుకాలేదు. అనారోగ్యంగా ఉందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అదికారులు ప్రకటించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్  విదేశీ పర్యటనలో ఉండటం వల్ల సమావేశానికి హాజరుకాలేదు. 
ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరుకాలేదు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్ల హాజరుకాలేకపోయినట్లు ప్రకటించారాయన.. 
కేరళ సీఎం పినరయి విజయన్ సైతం హాజరుకాలేదు. కారణాలు ఏంటీ అనేది మాత్రం కేరళ ప్రభుత్వం స్పష్టం చేయలేదు.
 కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు కూడా ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరుకాలేదు. కర్ణాటక మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండటం వల్లే వెళ్లలేకపోయినట్లు తెలుస్తుంది. 

దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ కారణాలతో ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవటం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.