- రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 మంది వడదెబ్బతో చనిపోయారు.
కరీంనగర్ జిల్లాలో ముగ్గురు...
జమ్మికుంట/తిమ్మాపూర్, వెలుగు : వడదెబ్బ కారణంగా కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు చనిపోయారు. వీణవంక మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వేల్పుల ఐలయ్య (58), ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిప్పరబోయిన మొగిలి తల్లి కనకమ్మ (90) వడదెబ్బతో మృతిచెందారు. అలాగే తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పర్శరాములు (62) మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
మహబూబాబ్ జిల్లాలో వృద్ధురాలు...
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (60) గురువారం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం తిరిగి వచ్చింది. రాత్రి భోజనం చేసి పడుకున్న భద్రమ్మ ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసే సరికే చనిపోయి కనిపించింది. వడదెబ్బ కారణంగా చనిపోయిందని కొడుకు నగేశ్ తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఇద్దరు...
పాల్వంచ/గుండాల, వెలుగు : భద్రాద్రి జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాకు చెందిన మేడిశెట్టి కోటమ్మ (85) ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు శుక్రవారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. గుండాల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన జనగం రాంబాబు (42) ఖమ్మంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రోజుమాదిరిగానే ఆటో తీసుకొని వెళ్లిన రాంబాబు.. సాయంత్రం ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు.
సిద్దిపేటలో ఉపాధి కూలీ..
కొండపాక, వెలుగు : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రవీంద్రనగర్‌కు చెందిన జోగు శారద (60) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. గురువారం విశ్వనాథ్‌పల్లిలో ఉపాధి హామీ పని చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. గమనించిన తోటి వారు సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి ఆర్‌వీఎం హాస్పిటల్‌కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయింది.
వడ్ల కుప్ప దగ్గరే కుప్పకూలిన రైతు..
కొల్చారం, వెలుగు : వడదెబ్బకు గురైన ఓ రైతు వడ్ల కుప్ప దగ్గరే కుప్పకూలాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామానికి చెందిన వెంకటాపూర్ శంకర్(61) వడ్లను కొనుగోలు కేంద్రంలో పోశాడు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో కొన్ని రోజులుగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురై వడ్ల కుప్ప దగ్గరే కుప్ప కూలి చనిపోయాడు.
నల్గొండ జిల్లాలో ఒకరు...
నార్కట్‌పల్లి, వెలుగు : వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో జరిగింది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన కూకుట్ల కృష్ణయ్య గురువారం వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చెర్వుగట్టుకు వచ్చి కృష్ణయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
