తాహతుకు మించి అప్పు.. అన్నదమ్ముల కుటుంబాలు బలి

తాహతుకు మించి అప్పు..  అన్నదమ్ముల కుటుంబాలు బలి
  • అప్పుల భారానికి అన్నదమ్ముల కుటుంబాలు బలి
  • విషం తాగి ఒకేసారి 9 మంది ఆత్మహత్య​
  • మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో దారుణం

ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో దారుణం జరిగింది. తాహతు​కు మించి తెచ్చిన అప్పులు భారంగా మారి ఇద్దరు అన్నదమ్ములు కుటుంబాలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లితోపాటు రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది విషం తాగి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సాంగ్లి జిల్లాలోని మహైసల్ గ్రామంలో పోపట్​వన్మోర్, మానిక్​ వన్మోర్ ​ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పోపట్ వన్మోర్ టీచర్. అతనికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మానిక్​ వన్మోర్​ వెటర్నరీ డాక్టర్. మానిక్​కు కూడా భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. పోపట్, మానిక్​ల​ తల్లి కూడా వాళ్లతోపాటే ఉంటోంది. 


ఇంటిల్లిపాదీ ఆత్మహత్య


తెలిసినవారు, బంధువుల దగ్గర అన్నదమ్ములిద్దరూ తాహతు​కు మించి అప్పులు చేశారు. వాటిని తీర్చే మార్గం కనిపించక తల్లితో సహా ఇంటిల్లిపాది 9 మంది ఆదివారం రాత్రి విషం తాగారు. సోమవారం ఉదయం పాలు తీసుకోవడానికి ఇంకా రావడం లేదని దగ్గరలో ఉండే ఓ బాలిక వారి ఇంటికి వెళ్లి చూసింది. మానిక్ వన్మోర్ ​ఇంట్లో మానిక్, అతని తల్లి, భార్య, కొడుకు, కుమార్తె,  సోదరుడి కుమారుడు మొత్తం ఆరుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. దగ్గరలోని మరో ఇంట్లో పోపట్ వన్మోర్, అతని భార్య, కుమార్తె చనిపోయి పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సూసైడ్​ నోట్లు స్వాధీనం చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్నదమ్ముల కుటుంబాలు అప్పుల భారంతోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని కొల్హాపూర్​ రేంజ్​ఐజీ మనోజ్ ​కుమార్​ లోహియా తెలిపారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.