ఆరు రోజుల్లో కరోనాను జయించిన 9 నెలల చిన్నారి

ఆరు రోజుల్లో కరోనాను జయించిన 9 నెలల చిన్నారి

డెహ్రాడూన్: ఉత్తరాఖంఢ్​లో తొమ్మిది నెలల వయసు పసికందు కరోనాను జయించింది. అత్యంత తక్కువ సమయంలోనే కరోనా బారి నుంచి బయటపడింది. ఏప్రిల్17న డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరిన ఆ చిన్నారి ఆరురోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. గడిచిన రెండ్రోజుల్లో రెండు సార్లు టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చిందని దీంతో డాక్టర్లు డిశ్చార్జి చేశారని తెలిపింది. అయితే, ఆ బాలుడికి తండ్రి నుంచి వైరస్ సోకి ఉంటుందని చెప్తున్నారు. ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కు వెల్లివచ్చిన చిన్నారి తండ్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతున్నాడు. వైరస్ నుంచి కోలుకుని చిన్నారి తల్లి దగ్గరికి చేరకోగా తండ్రిమాత్రం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడని డూన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్​ఎస్​ ఖాత్రి తెలిపారు.

‘‘నెలల వయసున్న పసికందు కావడంతో ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్నాం. చిన్నారి తల్లి సహా ఇతర కుటుంబ సభ్యులకు కరోనా లేదు. ప్రస్తుతం చిన్నారితో పాటు తల్లి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పసికందుకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. అతనికి ఎక్కువ మందులు కూడా వాడలేదు. వారం రోజుల పాటు చక్కగా నవ్వుతూ హాస్పిటల్ లో ఉన్నాడు. ఇప్పుడతను కోలుకోవడంతో ఆస్పత్రిలో సంతోషకర వాతావరణం నెలకొంది” అని ఆ చిన్నారికి చికిత్స అందించిన డాక్టర్ అగర్వాల్ చెప్పారు. రాష్ట్రంలో ఇంతవరకు తక్కువ రోజుల్లో కరోనా నుంచి బయటపడింది ఈ చిన్నారేనని, అంతకుముందు ఓ ట్రైనీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ 10 రోజుల్లో కోలుకున్నాడని చెప్పారు.