ఈ వరంగల్ డాక్టర్ 9 నెలల గర్భిణి.. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఘోరం జరిగిపోయింది !

ఈ వరంగల్ డాక్టర్ 9 నెలల గర్భిణి.. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఘోరం జరిగిపోయింది !

‘మెటర్నిటీ లీవ్​లో వెళ్తున్నా.. మళ్లీ కలుస్తా’ అంటూ సహచర ఉద్యోగులకు చెప్పి వెళ్లిన ఓ మహిళా డాక్టర్​ యాక్సిడెంట్​లో ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి  వీరిని టిప్పర్​ ఢీకొట్టింది. వరంగల్​లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వరంగల్ సిటీ, వెలుగు: “ మెటర్నిటీ లీవ్ లో వెళ్తున్నా.. సెలవులు అయ్యాక మళ్లీ కలుస్తా..’’ అంటూ తోటి ఉద్యోగులతో చెప్పి వెళ్లిన మహిళా డాక్టర్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. గ్రేటర్ వరంగల్ సిటీ హంటర్ రోడ్డులో సోమవారం (జనవరి 26) సాయంత్రం జరిగిన ఘటన స్థానికులను కలిచి వేసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ ఫైనల్ ఇయర్ చదివే సాలి రాఘవేంద్ర, హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమతారాణి(33), ఏడాది కిందట పెండ్లి చేసుకున్నారు.

 ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి కావడంతో భర్త రోజూ ఆస్పత్రి వద్ద దింపి, తీసుకెళ్తుండేవాడు. మంగళవారం నుంచి మెటర్నిటీ లీవ్ పెట్టింది. సాయంత్రం డ్యూటీ ముగించుకుని, సహచర ఉద్యోగులకు చెప్పి భర్తతో కలిసి స్కూటీపై దేశాయిపేటలోని ఇంటికి బయలుదేరారు. హంటర్ రోడ్డులోని ఏడు మోరీల జంక్షన్ వద్ద వెనక నుంచి వచ్చి టిప్పర్ లారీ(టీఎస్ 03 యూబీ 0943) స్కూటీని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో స్కూటీపై నుంచి కిందపడిన మమతారాణి  తీవ్రంగా గాయపడింది. 

స్థానికుల సాయంతో ఆమెను భర్త హనుమకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మమతారాణి మృతిచెందింది. భర్త రాఘవేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. మహిళా డాక్టర్ మృతితో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.