ఇల్లందకుంటలో 90 శాతం పోలింగ్​

ఇల్లందకుంటలో 90 శాతం పోలింగ్​
  • మండలంలోని 224వ బూత్​లో మొరాయించిన ఈవీఎం
  • రాత్రి 9 గంటల వరకు ఓటింగ్​
  • ఇల్లందకుంటలో స్థానికేతరులను అడ్డుకున్న గ్రామస్తులు

హనుమకొండ, ఇల్లందకుంట, వెలుగు: ఇల్లందకుంట మండలంలో హుజూరాబాద్​నియోజకవర్గంలోనే అత్యధికంగా 90.02 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 24,799 మంది ఓటర్లు ఉండగా 11,172 మంది పురుషులు.. 11,152 మంది స్త్రీలు ఓటేశారు. ఇల్లందకుంటలో 224వ పోలింగ్ బూత్ లోని ఈవీఎం ఉదయం మొరాయించింది. దీంతో చాలా మంది ఓటర్లు విసుగుతో మధ్యలోనే వెళ్లిపోయారు. తర్వాత ఈవీఎంను రీ ప్లేస్ చేయగా గంటన్నర ఆలస్యంగా పోలింగ్ స్టార్టయింది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉండగా రాత్రి 9 గంటల వరకు ఓటింగ్ పెట్టాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రంలో 1,111 మంది ఓటర్లుండగా 89 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని లక్ష్మాజీపల్లి, చిన్న కోమటిపల్లి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.  

ప్రలోభాలకు టీఆర్ఎస్ లీడర్ల ప్రయత్నం
ఓ వైపు పోలింగ్ నడుస్తుండగానే మరోవైపు టీఆర్ఎస్ లీడర్లు ప్రలోభాలకు తెరలేపారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, టీఆర్ఎస్ గ్రామ ఇన్​చార్జి మాదాసు శ్రీనివాస్ శనివారం శ్రీరాములపల్లిలో తన వెహికల్​లో చక్కర్లు కొడుతూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన బీజేపీ కార్యకర్తలు ఆయన వెహికల్​ను అడ్డగించారు. పోలింగ్ జరుగుతుంటే ఇక్కడేం పని అని ప్రశ్నించారు. రూల్స్​ప్రకారం 27నే స్థానికేతరులు ఊళ్లు ఖాళీ చేయాలని, ఇంకా ఇక్కడే ఎందుకున్నారని నిలదీశారు. మరోవైపు టీఆర్ఎస్ కు ఓటేసేందుకు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారికి డబ్బు ఆశ చూపి రప్పించారు. కానీ ముందు చెప్పినట్టు డబ్బు ఇవ్వకపోవడంతో శ్రీరాములపల్లి సర్పంచ్ మొగిలిని స్థానికులు నిలదీశారు.