తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 94 కరోనా కేసులు నమోదు కాగా.. ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం రాత్రి 8 గంటలకు బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటల మధ్య నమోదైన కేసులు మరణాల వివరాలను వెల్లడించింది. ఈ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 94 కేసులు నమోదు కాగా..ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కు చేరింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 88కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 1491 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1213 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 79 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ లో 3, మెదక్ లో రెండు, నల్లగొండలో 2, సంగారెడ్డిలో 2 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మహబూబబాద్, పెద్దపెల్లి, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.
