వెనిజులా ఆయిల్ రంగంలో ఇన్వెస్ట్ చేయము.. ట్రంప్‌కి తేల్చి చెప్పేసిన అమెరికా కంపెనీ సీఈవో

వెనిజులా ఆయిల్ రంగంలో ఇన్వెస్ట్ చేయము.. ట్రంప్‌కి తేల్చి చెప్పేసిన అమెరికా కంపెనీ సీఈవో

వెనిజులా చమురు రంగాన్ని పునరుద్ధరించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలలకు ఆ దేశ ఆయిల్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన కీలక భేటీలో ఎక్సాన్‌మొబిల్(ExxonMobil) సీఈఓ డారెన్ వుడ్స్ వెనిజులా ప్రస్తుత పరిస్థితులపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రస్తుతం వెనిజులాలో పెట్టుబడులు పెట్టడం అసాధ్యమని, అక్కడ తమ ఇన్వెస్ట్మెంట్లకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేవని ఆయన స్పష్టం చేశారు.

డారెన్ వుడ్స్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ.. వెనిజులాలో అస్థిరమైన న్యాయ వ్యవస్థ, పాతబడిన హైడ్రోకార్బన్ చట్టాలు పెట్టుబడిదారులకు ఏమాత్రం భరోసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎక్సాన్‌మొబిల్ చరిత్రను గుర్తు చేస్తూ.. 1940ల నుంచి ఆ దేశంలో ఉన్న తమ ఆస్తులను గతంలో రెండుసార్లు అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, కాబట్టి మూడోసారి అడుగు పెట్టాలంటే పక్కాగా మన్నికైన పెట్టుబడి రక్షణలు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అమెరికా ప్రభుత్వం చొరవ తీసుకుంటే వెనిజులా మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ఒక టెక్నికల్ టీం పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఆయిల్ కంపెనీల సీఈఓల సందేహాలను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపారేశారు. వెనిజులాలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయని, ఆసక్తి లేని వారు తప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. టేబుల్ చుట్టూ కూర్చున్న వారు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు, వారికి రిస్క్ అంటే ఏంటో తెలుసని అంటూ.. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఎటువంటి ఆర్థిక హామీలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వెనిజులాలోనే అమెరికన్ కంపెనీలకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఇందుకోసం అమెరికా సైన్యాన్ని పంపాల్సిన అవసరం లేదని ట్రంప్ భరోసా ఇచ్చారు.