‘వరంగల్‍’లో 9,483 మందికి ఇందిరమ్మ ఇండ్లిచ్చినం : మంత్రి కొండా సురేఖ

‘వరంగల్‍’లో 9,483 మందికి ఇందిరమ్మ ఇండ్లిచ్చినం : మంత్రి కొండా సురేఖ

వరంగల్‍/ ఖిలా వరంగల్‍, వెలుగు: వరంగల్‍ జిల్లాలో 9,483 మంది పేదలకు ఇందిరమ్మ పథకంలో ఇండ్లిచ్చామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‍ జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఖిలా వరంగల్‍ ఖుష్‍ మహల్‍ వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి సురేఖ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 3,846 డబుల్‍ బెడ్‍రూం ఇండ్ల నిర్మాణానికి టెండర్‍ ప్రక్రియ పూర్తయిందని, ఇందులో 2,237 ఇండ్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. 

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్కులో 866 మంది రైతులకు రూ.145 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు రాజీవ్‍గాంధీ మోడల్‍ కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వరంగల్‍ నగరంలో ఇన్నర్ రింగ్‍ రోడ్‍ కోసం 314 మంది రైతుల నుంచి 41 ఎకరాలు సేకరించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ కోసం 253 ఎకరాల భూములను 330 మంది రైతుల వద్ద సేకరించి, వారికి రూ.258 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు. నేషనల్ హైవే 163_జీ పరిధిలో వరంగల్‍, నర్సంపేట డివిజన్లలో రోడ్డు ప్రతిపాదనలు జరిగాయన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 2025–26 ఏడాదికి రూ.127 కోట్ల 54 లక్షలతో 945 పనులు ప్రతిపాదించామన్నారు. అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్​ తూర్పు పరిధిలో నిర్మించిన పలు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో  పాల్గొన్నారు.