హైదరాబాద్, వెలుగు: టీఎస్ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 9,680 మందికి సీట్లను కేటాయించగా..ఇంజినీరింగ్లో 82%(9,606), ఫార్మసీలో6% సీట్లు భర్తీ అయ్యాయి. స్టేట్లో మొత్తం 171 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా అందులో12 సర్కారు కాలేజీలున్నాయి. సర్కారు కాలేజీల్లో 1565 సీట్లకు 1358 సీట్లు నిండగా, ప్రైవేటులో 9912 సీట్లకు 8033 సీట్లు భర్తీ అయ్యాయి. 117 ఫార్మసీ కాలేజీల్లో 1213 సీట్లుండగా, కేవలం 74 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తక్కువ ఆప్షన్లు పెట్టుకోవడంతో 3200 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ కాలేదు.
సీట్లు పొందిన స్టూడెంట్లు ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. మొత్తం 1617 సీట్లకు 1562 సీట్లు (96.60%) నిండాయి. ఎలక్ర్టానిక్ అండ్ ఎలక్ర్టికల్ కోర్సుల్లో 2892 సీట్లకు 2736 సీట్లు ( 94.61%) భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ కేటగిరీలో మొత్తం 6,900 సీట్లుంటే, 5,118 (74.17%) మంది సీట్లు పొందారు.

