
ఖర్తూమ్: ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీకి మధ్య వరుసగా మూడో రోజు సోమవారం కూడా ఘర్షణలు కొనసాగాయి. ఈ రెండు సైనిక వర్గాలు ఒకదాని స్థావరాలను మరొకటి టార్గెట్ చేసుకొని దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 97కి చేరుకుంది. మరో 600 మందికి పైగా గాయాలపాలయ్యారు.
సుడాన్ రాజధాని ఖర్తూమ్, దాని పక్కనే ఉన్న ఓమ్‌దుర్మాన్ సిటీ సహా అనేక చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ఆ ప్రాంతమంతా తెల్లటి పొగ వ్యాపించింది. దాంతో ప్రజలు తమ ఇండ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. కరెంటు సప్లై ఆగిపోవడంతో ఇండ్లల్లో దొంగలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూడాన్‌లోని పారా మిలటరీకి చెందిన ఆర్ఎస్ఎఫ్ దళాన్ని ఆర్మీలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు దారితీసింది.