వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

వేడి గాలులతో ఆస్పత్రులకు క్యూ.. 98 మంది మృతి, 400మందికి చికిత్స

రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్టోగ్రతలు, వేడి గాలుల నేపథ్యంలో గడిచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కనీసం 98 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 54 మంది చనిపోగా, బీహార్‌లో అత్యంత వేడి వాతావరణం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు.

జూన్ 15, 16, 17 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో చేరిన కనీసం 54 మంది ప్రజలు తీవ్రమైన వేడి కారణంగా మరణించారు. జ్వరం, శ్వాస ఆడకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో గత మూడు రోజుల్లోనే కనీసం 400 మంది బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో చేరినట్లు  అధికారులు తెలిపారు. రోగులలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరుతున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు.

"ప్రజలంతా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా వారి పరిస్థితి మరింత దిగజారింది" అని బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ జూన్ 17న అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. జూన్ 15న 23 మరణాలు, జూన్ 16న 20, జూన్ 17న సాయంత్రం 4 గంటల వరకు 11 మరణాలు నమోదయ్యాయి. మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి రాజధాని లక్నో నుంచి వైద్యుల బృందాన్ని పిలిపించాలని ప్రభుత్వం కోరింది.

రోగులు, సిబ్బందికి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) దివాకర్ సింగ్తెలిపారు. రోగుల రద్దీ కారణంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని స్పష్టం చేశారు. "పెద్ద సంఖ్యలో రోగులు ఆసుపత్రిని రావడంతో ప్రస్తుతం స్ట్రెచర్ల కొరతను ఎదుర్కొంటున్నామని ఓ అధికారి తెలిపారు. భారత వాతావరణ డేటా (IMD) ప్రకారం, జూన్ 16న బల్లియాలో గరిష్ట ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ. తీవ్ర వేడిగాలుల కారణంగా బీహార్‌లో గడిచిన 24 గంటల్లో 44 మంది మరణించారు.