8 రోజుల్లో రెండున్నర కోట్ల మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్

8 రోజుల్లో రెండున్నర కోట్ల మందికి పైగా టీనేజర్లకు వ్యాక్సిన్

దేశంలో థర్డ్ వేవ్ ముప్పు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం బూస్టర్ (ప్రికాషనరీ) డోసు వ్యాక్సినేషన్‌పై నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫ్రంట్‌ లైన్ వర్కర్లు, హెల్త్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడి కోమార్బిడ్ కండిషన్లతో బాధపడుతున్న వారికి  జవనరి 10 నుంచి మూడో డోసు వ్యాక్సిన్‌ను వేయబోతున్నట్లు ప్రధాని మోడీ గత నెల చివరి వారంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రికాషనరీ డోసు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదలైన తొలి రోజే దాదాపు పది లక్షల మందికి బూస్టర్ డోసు వేశారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజులో 9 లక్షల 84 వేల 676 మందికి ప్రికాషనరీ డోసు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదు లక్షల 19 వేల 604 మంది హెల్త్ కేర్ వర్కర్లకు, రెండు లక్షల ఒక వెయ్యి 205 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, అరవై ఏండ్లు పైబడి కోమార్బిడ్ కండిషన్లతో బాధపడుతున్న 2,63,867 మందికి మూడో డోసు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం పేర్కొంది.  

8 రోజుల్లో రెండున్నర కోట్ల మందికి పైగా టీనేజర్లకు.. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు 152 కోట్లకు పైగా డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జనవరి 3న మొదలుపెట్టిన టీనేజర్ల (15 నుంచి 18 ఏండ్ల లోపు) వ్యాక్సినేషన్‌ కూడా జోరుగా నడుస్తోంది. నిన్నటి వరకు (ఎనిమిది రోజుల్లోనే) 2 కోట్ల 62 లక్షల 35 వేల 531 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది.