ఇటీవల పలు ఎయిర్ పోర్ట్ లకు చెందిన విమానాల్లో పాములు ప్రత్యక్షమవుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్ట్ అధికారులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
జోహన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పైథాన్ బొమ్మ ఉన్న టీషర్ట్ ధరించాడనే కారణంతో ఓ బాలుడు ఫ్లైట్ ఎక్కేందుకు ప్రయత్నించగా ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు.
స్టేవీ లుకాస్ అనే 10ఏళ్ల బాలుడు తన పేరెంట్స్ తో కలిసి న్యూజిల్యాండ్ నుండి సౌతాఫ్రికాలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల్ని చూసేందుకు వెళ్లాడు. తిరిగి సౌతాఫ్రికానుండి న్యూజిల్యాండ్ కు వచ్చేందుకు జోహన్నెస్‌బర్గ్ విమానశ్రయానికి వచ్చాడు. అయితే స్టేవీ పైథాన్ ఉన్న టీషర్ట్ ధరించడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు బాలుడ్ని అడ్డుకున్నారు. పాము బొమ్మలతో డిజైన్ చేసిన టీషర్ట్ లను ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించడంలేదని చెప్పారు. టీషర్ట్ మార్చుకొని వస్తే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తామని అన్నారు.
అయితే పైథాన్ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకోవడం వల్ల విమానంలోని ప్రయాణికులు భయపడతారని, ఇటీవల పలు విమానాల్లో పాములు ప్రత్యక్షమవ్వడంపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్ట్ అధికారులు సూచనతో స్టేవ్ తనకు ఎంతో ఇష్టమైన టీషర్ట్ మార్చి వేరొక టీషర్ట్ ధరించడంతో ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతి లభించింది.
