మతం మార్చుకొని 44 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 13 ఏళ్ల బాలిక

మతం మార్చుకొని 44 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 13 ఏళ్ల బాలిక

పాకిస్తాన్‌లో క్రైస్తవ మతానికి చెందిన ఓ 13 ఏళ్ల బాలిక మతం మార్చుకొని ముస్లీం మతానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడింది. బాలికను అపహరించి, డబ్బు ఆశ చూపి ఈ పెళ్లి చేశారని బాలిక కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. అయితే బాలిక తన ఇష్టానుసారమే మతం మార్చుకొని పెళ్లి చేసుకుందని అక్టోబర్ 27న సింధ్ కోర్టు బాలికను ఆమె భర్తకు అప్పగించింది.

అర్జూ రాజా అనే 13 ఏళ్ల క్రైస్తవ బాలికను అలీ అజహర్ అనే 44 వ్యక్తి అపహరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. కేసును విచారించిన కోర్టు.. బాలిక ఇష్టానుసారమే ఇదంతా జరగిందని చెప్పి.. బాలికను అలీ అజహర్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. బాలికను ఆమె తల్లి నిజం చెప్పమని ఎంత బతిమిలాడినా.. బాలిక నిజం చెప్పకపోగా.. తిరిగి రావడానికి కూడా ఒప్పుకోలేదు. తనను ఎవరూ బెదిరించలేదని, డబ్బు ఆశ చూపలేదని బాలిక తెలిపింది. తల్లి తన కూతురును బతిమిలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

బాలిక ఇష్టపూర్తిగా వివాహం చేసుకున్నాకూడా బాలిక మైనర్ కావడంతో ఇది చట్టవిరుద్దమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. కోర్టు నిర్ణయాన్ని పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ హుస్సెన్ ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘గౌరవనీయమైన చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ ఎలివేషన్ సిస్టమ్‌లోని లొసుగులపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సింధ్ కోర్టు న్యాయమూర్తుల నిర్ణయం పాకిస్తాన్ న్యాయ వ్యవస్థను ధిక్కరించేదిగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

బాలిక వివాహం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివిధ మానవ హక్కుల సంస్థలు అర్జూ రాజాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్తాన్ (హెచ్‌ఆర్‌ఎఫ్‌పి) అధ్యక్షుడు నవీద్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘మైనారిటీ బాలికలు, ముఖ్యంగా క్రైస్తవులు, హిందువులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మారి దేశంలోని ముస్లిం పురుషులను వివాహం చేసుకునేలా చేశారు. అర్జూ విషయంలో కూడా అదే జరిగింది. అర్జూ యొక్క వ్యక్తిగత సమాచార రికార్డులన్నీ కూడా వయస్సుతో సహా మార్చబడ్డాయి. ఆమెను 18 సంవత్సరాల వయసు గల యువతిగా చూపించారు. పాఠశాల రికార్డుల ప్రకారం.. అర్జూ వయసు 13. ఆమె జూలై 31, 2007న జన్మించింది. ఆమె స్కూల్ ధృవపత్రాలు, చర్చి రికార్డులలో కూడా 2007 అనే ఉంది. కానీ, పెళ్లి కోసం ఆమె వయసును తప్పుగా పేర్కొన్నారు. మదరసా జామియా ఇస్లామియా నుంచి మత మార్పిడి సర్టిఫికేట్ మరియు అర్జూ ఫాతిమా పేరుతో వివాహ ధృవీకరణ పత్రాన్ని కోర్టులో సమర్పించారు’అని ఆయన అన్నారు.

For More News..

అంత్యక్రియల్లో అత్తకు నీచమైన సైగలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఓటు హక్కు వినియోగించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థులు

తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు