శ్రీలంకకు సాయం చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు 

శ్రీలంకకు సాయం చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు 

ఆర్థిక సంక్షోభ సమయంలో  శ్రీలంకను అన్ని విధాలా ఆదుకున్న భారత దేశానికి ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో  శ్రీలంకకు సాయం చేసి ప్రాణం పోసిన ప్రధాని మోడీకి తన తరపున..దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ద్వీప దేశానికి  ప్రాణం పోసిందని రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో అన్నారు. పొరుగుదేశం ఇండియా చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేమని చెప్పారు. గతవారం  విక్రమసింఘేను ప్రధాని మోడీ అభినందించారు. ఆర్థిక పునరుద్ధరణకు శ్రీలంక ప్రజలకు భారతదేశం మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.  ఆర్థిక సంక్షోభం నుంచి కొత్త అధ్యక్షుడు దేశాన్ని విజయపథంలో నడిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంకకు భారత ప్రభుత్వ చేసిన సాయం దాదాపు 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఆర్థిక సహాయంపై దేశం ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF),ఇతర విదేశీ దేశాలతో చర్చలు జరుపుతోంది. విక్రమసింఘే తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి  శ్రీలంక దీర్ఘకాలిక పరిష్కారాల వైపు వెళ్లాలని అన్నారు.రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను వివరిస్తామని ఆయన చెప్పారు.విదేశీ పెట్టుబడుల ప్రాజెక్టులపై వ్యతిరేకత కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విక్రమసింఘే అన్నారు.