
- యూపీలోని ఉన్నావ్‌లో ఘోరం
- మరో 19 మందికి గాయాలు
ఉన్నావ్(యూపీ) : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు బుధవారం తెల్లవారుజామున పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులోని18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బిహార్‌లోని మోతిహరి నుంచి 60 మంది ప్యాసింజర్లతో ఢిల్లీకి వెళ్తున్న బస్సు యూపీలోని ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మిల్క్ ట్యాంకర్‌ను వెనక నుంచి ఢీకొంది. దీంతో రెండు వెహికల్స్ రోడ్డుపై బోల్తాపడ్డాయి. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జవడంతోపాటు, ఒకవైపు సీట్లలోకి ట్యాంకర్ చొచ్చుకెళ్లింది.
ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు మహిళలు, 14 మంది మగవాళ్లు, ఓ చిన్నారి మృతిచెందారు. సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న రెస్క్యూటీం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 19 మందిని మరో బస్సులో ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు నుజ్జునుజ్జవడంతో అతికష్టంమీద మృతదేహాలను వెలికితీశారు. క్రేన్లను ఉపయోగించి వెహికల్స్‌ను క్లియర్ చేశారు.
ముర్ము, మోదీ సంతాపం
మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ‘18 మంది మరణించారన్న వార్త చాలా బాధాకరమైనది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినోళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ముర్ము ట్వీట్ చేశారు. అలాగే, ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కూటమి నేతలు విచారం వ్యక్తం చేశారు.