హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి ఎగ్జామ్స్ నిర్వహించే టీఎస్‌పీఎస్సీకే ఓ అభ్యర్థి పరీక్ష పెట్టాడు. గ్రూప్1 ప్రిలిమ్స్‘కీ’పై అభ్యంతరాలు అడిగితే, అన్నింటికీ అబ్జెక్షన్లు పెట్టి కమిషన్‌కు పని పెట్టాడు. వరుసగా ఒకే సర్వీస్ నుంచి 50 వరకు ఆబ్జెక్షన్లు రావడంతో, టీఎస్‌పీఎస్సీ అధికారులు అతనికి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీనికి అతనిచ్చిన సమాధానంతో ఆఫీసర్లు ఖంగుతున్నారు. “గ్రూప్ 1లో క్వశ్చన్లు తికమకగా ఇచ్చారు. ‘కీ’లో ఆన్సర్లు చూసేందుకు నాకు మరో పరీక్ష పెట్టారు. నేను రాసిన ఆన్సర్లు చూసుకునేందుకు నాకు రెండు గంటల టైమ్ పట్టింది. అందుకే మీకూ పరీక్ష పెడుతున్న చూసుకోండి” అంటూ ఆన్సర్ ఇచ్చినట్టు సమాచారం.
150 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లకు అబ్జెక్షన్లు ఇచ్చాడు. కాగా, ఆ అభ్యర్థి పెట్టిన అబ్జెక్షన్లను పరిశీలిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ప్రిలిమినరీ ‘కీ’పై సుమారు వెయ్యి వరకు అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసింది. అబ్జెక్షన్ల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఓ ఎక్స్ పర్ట్ కమిటీని నియమించారు. వారు అభ్యంతరాలను పరిశీలించి, ఆన్సర్లను ఫైనల్ చేయనున్నారు. దీనికి మరో పది రోజుల సమయం పట్టే అవకాశముందని, వచ్చే సోమవారం లేదా మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.