
కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్నిర్వహించి అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 11,679 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని, జిల్లా అధికారులు మార్గనిర్ధేశం చేయాలన్నారు. ఇంకా ప్రారంభం కాని ఇంటికి వెంటనే మార్కవుట్ ఇవ్వాలన్నారు. మార్కవుట్ వచ్చిన ఇండ్లు బెస్మిట్ లెవల్‌కు వచ్చేలా చూడాలన్నారు. రుణ మంజారుపై ఐకేపీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
నిర్ధేశించిన లక్ష్యాలను 15 రోజుల్లోగా కంప్లీట్ చేసేందుకు అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, హౌజింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
జిల్లాలోని వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతులు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం వడ్ల కొనుగోలుపై కలెక్టర్లు, అధికారులతో అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్పోర్ట్స్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నీళ్లు నిల్వ లేని ఏరియాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి సెంటర్లో టార్పాలిన్లు అందుబాటులో ఉండాలన్నారు.
కాంటా అయిన వెంటనే టాబ్లో ఎంట్రీ చేయాలని, రైతులకు 48 నుంచి 72 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్డీవో సురేందర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్రావు, డీఎం శ్రీకాంత్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.