
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. బుధవారం (ఆగస్టు 27) మెదక్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఎక్కడా చూసినా వరదలతో జనజీవనం స్తంభించింది.
ముఖ్యంగా మెదక్ హవేలీ ఘనపూర్ మండలంలో నక్కవాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వాగు ప్రవాహానికి రోడ్లు నదుల్లా మారిపోయాయి. భారీ వరదలో కారు కాగితం పడవలా కొట్టుకోవడం భయాందోళనకు గురి చేస్తోంది. కారు కొట్టుకుపోవడం చూసిన స్థానికులు భయంతో అరుస్తూ కాపాడలేని స్థితిలో ఆందోళన వ్యక్తం చేశారు.
కారులో ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా తెలియదు. నలుగురు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. వాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.